తెలుగు పాలిటిక్స్ 2024 : టోటల్ గా నారా భువనేశ్వరి హైలెట్
ఆమె ఒక సీఎం కి కుమార్తె. మరో సీఎం కి సతీమణి. ఇంతకీ ఆమె పేరు ఏంటి అంటే నారా భువనేశ్వరి.
By: Tupaki Desk | 25 Dec 2024 3:39 AM GMTఏపీలో 2024 మరి కొద్ది రోజులలో ముగియనుంది. ఈ ఏడాది ఏమి ఇచ్చింది. ఎవరికి హైలెట్ అయింది ఎవరికి ఝలక్ ఇచ్చింది అన్నది చూసుకుంటే కనుక ఒక పేరు చెప్పుకోవాల్సిందే. ఆమెకు రాజకీయం అయితే తెలియదు. ఆమె ఒక సీఎం కి కుమార్తె. మరో సీఎం కి సతీమణి. ఇంతకీ ఆమె పేరు ఏంటి అంటే నారా భువనేశ్వరి.
అవును చంద్రబాబు సతీమణిగా తన వ్యాపార వ్యాపకాలను చూసుకునే ఆమె 2024లో బాగా ఏపీలో హైలెట్ అయ్యారు. ఆమె తన భర్తకు తోడుగా జనంలోకి వచ్చారు. నిజానికి చూస్తే ఆమె 2023 సెప్టెంబర్ లో బాబుని అరెస్ట్ చేసినపుడే ప్రజలలోకి వచ్చారు. బాబు అదే ఏడాది రిలీజ్ అయ్యారు.
ఆ తరువాత భువనేశ్వరి జనంతో మమేకం అవుతూనే 2024లోకి ఎంటర్ అయ్యారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. ఈ విషయంలో నారా భువనేశ్వరి పాత్ర కూడా చాలానే ఉంది అని చెప్పాల్సి ఉంది.
ఆమె మహిళలతో నిర్వహించిన సభలు ఆమె జనాలతో మమేకం అయిన తీరు ఆమె చేసిన ప్రకటనలు టీడీపీ గురించి చంద్రబాబు గురించి ఆమె చేసిన ప్రచారం అన్నీ కూడా మే నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కూటమిని విజయతీరాలకు చేర్చడంతో ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి.
ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఆమె వచ్చినపుడు రెట్టింపు ఆనందం పొందారు. ఒక వైపు భర్త చంద్రబాబు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూంటే మరో వైపు కుమారుడు నారా లోకేష్ రెండవ మారు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ విధంగా ఈ రెండు అనుభూతులను ఆమె నిండుగా పొందిన వారుగా 2024 తెలుగు పాలిటిక్స్ లో హైలెట్ అయ్యారు.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా ఆమె తన వంతుగా జనంలోకి వస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆమె తరచూ పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజల బాగోగులు చూస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూస్తున్నారు.
ఆ విధంగా ఆమె భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎక్కువగా పాలన మీద ఫోకస్ పెట్టాల్సి ఉండడంతో అనధికారికంగా కుప్పం బాధ్యతలను నారా భువనేశ్వరి తీసుకున్నారు అని అంటున్నారు. గతంతో పోలిస్తే ఆమె ప్రసంగాలు బాగా రాటు తేలాయి. ఆమె జనాలను ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు.
ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఒపీనియన్ పెరిగేలా చూస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఆమె రాజకీయాల్లోకి అయితే అడుగు పెట్టేది లేదనే అంటున్నారు. అయితే ఆమె ప్రభావం మాత్రం 2024లో ఏపీ రాజకీయాల మీద బాగానే పడింది. ఒక హిస్టారికల్ పార్టీ అధినేత భార్యగా తొలి అర్ధ భాగం జనం తో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి సతీమణిగా మలి అర్ధ భాగంలోనూ కనిపించారు. ఆ విధంగా ఏపీలో ఏ పార్టీ అధినేత సతీమణీ చేయని విధంగా ఆమె జనంలో ఉంటూ ప్రజా జీవితంలో మమేకం అవుతున్నారు. 2024 నారా భువనేశ్వరికి ఈ విధంగా చూస్తే ఒక మరపు రాని ఇయర్ గానే ఉంది అని చెప్పాలి.