Begin typing your search above and press return to search.

తెలుగు పాలిటిక్స్ 2024 : గెలిచిన చంద్రబాబు చాణక్యం

ఎవరికి చేటు తెచ్చింది అన్న దాని మీద కూడా డిస్కషన్ సాగుతోంది.

By:  Tupaki Desk   |   13 Dec 2024 7:30 AM GMT
తెలుగు పాలిటిక్స్ 2024 : గెలిచిన చంద్రబాబు చాణక్యం
X

మరి కొద్ది రోజులలో 2024 సంవత్సరం ముగుస్తోంది. కొత్త సంవత్సరం 2025 మొదలవుతోంది. ఇలా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ 2024లో రాజకీయంగా మంచి చెడుల గురించిన విశ్లేషణ జరుగుతోంది. ఎవరికి మేలు చేసింది. ఎవరికి చేటు తెచ్చింది అన్న దాని మీద కూడా డిస్కషన్ సాగుతోంది.

ఏపీలో చూస్తే కనుక 2024 టీడీపీకి ఎంతో తీపిని పంచిపెట్టింది. ఒక విధంగా తెలుగుదేశం చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గెలుపుని 2024 ఎన్నికలు ఇచ్చాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక టీడీపీకి ఇంతటి భారీ విజయం ఆ పార్టీని వరించి ఎపుడూ రాలేదు.

టీడీపీ పెట్టాక నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏపీలో గెలని సీట్లు ముప్పయి దాకా ఉన్నాయని కూడా అంతా అనుకుంటూ వచ్చారు. ఇపుడు ఆ సీట్లలోనూ టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ కూడా సైకిల్ జోరుగా పరుగులు తీసింది. అంతే కాదు టీడీపీ కనీ వినీ ఎరగని తీరులో అనేక చోట్ల భారీ మెజారిటీలు దక్కాయి.

చాలా మందికి 90 వేల దాకా అతి భారీ మెజారిటీలు కూడా లభించడంతో అవాక్కయ్యే గెలుపుతో ఎవరి చేయిని వారే గిల్లుకునే పరిస్థితి ఉంది. మరి ఇంతటి గెలుపు ఎలా సాధ్యపడింది అంటే దాని వెనక చంద్రబాబు చాణక్య రాజకీయం ఉంది అని అంటారు. అలాగే పదును తేరిన బాబు వ్యూహాలు కూడా బాగా పనిచేశాయని చెబుతారు.

చంద్రబాబు 2019 ఎన్నికల్లో దక్కిన భారీ పరాజయం తరువాత మొదట్లో ఒకింత కృంగి పోయినా ఆ మీదట ఆయన ఎక్కడా నిరాశ అయితే చెందలేదు. పార్టీని ఒక వైపు కాపాడుకుంటూనే తాను గతంలో చేసిన తప్పులను గమనించి వాటిని సరిదిద్దుకున్నారు.

బీజేపీకి దూరం కావడం జనసేన విడిగా పోటీ చేయడం వల్లనే పార్టీ ఘోరంగా దెబ్బ తిన్నది అని గ్రహించిన చంద్రబాబు ఆ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా తన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమిటో చూపించారు.

కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నా ఏపీలో అయితే పెద్దగా లేదు. అయినా సరే ఆ పార్టీతో చెలిమి చేసారు. విముఖంగా ఉన్న కమలం పార్టీ పెద్దలను సుముఖంగా చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ని ఒక వైపు మోడీ సహకారం మరో వైపు ఉంచుకుని చంద్రబాబు ఎన్నికల కురుక్షేత్రంలో భీకరమైన పోరే సాగించారు.

అంతే కాదు విపక్షం నుంచి కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ గా షర్మిల రావడం ఆమె నేరుగా తన అన్న జగన్ మీద విమర్శలు సంధించడం కూడా టీడీపీకి లాభించింది. ఈ రకమైన రాజకీయ కూర్పుల వెనక కూడా బాబు వ్యూహాలు ఉన్నాయని ప్రచారం అయితే ఉంది. 2019లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగితే 2024లో దాని రిజల్ట్ కనిపించింది. అది అటం బాంబుగా పేలింది. వైసీపీని సొంత జిల్లాతో పాటు రాయలసీమ కంచుకోటలలో పటాపంచలు చేసింది. ఆ విధంగా తెర వెనక ఎత్తులు పై ఎత్తులు వేయడం ద్వారా చంద్రబాబు 2024 ఫలితాన్ని ముందే ఊహించారు అని అంటారు.

అభ్యర్ధుల ఎంపిక దగ్గర నుంచి కూటమికి ఇచ్చే సీట్ల నుంచి ఎవరిని ఎక్కడ బరిలోకి దింపాలన్న దాని గురించి మొత్తం అంతా తానై కూటమిని ఆయన శ్రీకృష్ణుడిగా విజయం వైపుగా నడిపారు అని అంటారు. ఏడున్నర పదుల వయసులో బాబు ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా చేసిన ఈ రాజకీయ పోరాటం చివరికి టీడీపీ కూటమికి బంపర్ విక్టరీని అందించింది.

దాంతో చరిత్ర మరచిపోలేని సక్సెస్ని టీడీపీ అందుకుంది. అలా 2024 అన్నది టీడీపీకి దాని అధినాయకుడు చంద్రబాబు ఎప్పటికీ మరపురాని ఏడాదిగానే చెప్పాల్సి ఉంటుంది. బాబుని ఏపీలోనూ జాతీయ రాజకీయాల్లో అత్యంత బలోపేతుడిగా చేసిన 2024 అంటే ఎప్పటికీ గోల్డెన్ ఇయర్ గానే తమకు ఉంటుందని తమ్ముళ్ళు సైతం అంటారు.