Begin typing your search above and press return to search.

తెలుగు పాలిటిక్స్ 2024 : నింగి నుంచి నేలకు జారిన వైసీపీ గ్రాఫ్

అలా మొదలైన జగన్ రాజకీయ జైత్ర యాత్ర కాస్తా ఎక్కడా బ్రేకులు లేకుండా కొనసాగింది.

By:  Tupaki Desk   |   13 Dec 2024 8:30 AM GMT
తెలుగు పాలిటిక్స్ 2024 : నింగి నుంచి నేలకు జారిన వైసీపీ  గ్రాఫ్
X

జగన్ అంటే ఫైర్. జగన్ అంటే మండే నిప్పు కణిక. జగన్ అంటే దూకుడు రాజకీయానికి మారు పేరు. ఇలా ఎన్నో పర్యాయపదాలు విశేషణాలు ఆయన గురించి చెప్పుకోవచ్చు. కేవలం 35 ఏళ్ల వయసులో అప్పటికే మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగి రెండు సార్లు సీఎం గా ఉమ్మడి ఏపీకి చేసి బలమైన ప్రతిపక్ష నేతగా ఉనన్ చంద్రబాబుని కేంద్రంలో ఎదురులేని తీరులో యూపీయేని నడిపిస్తున్న చైర్ పర్సన్ సోనియా గాంధీని ఎదిరించిన ఘనత జగన్ ది.

అలా మొదలైన జగన్ రాజకీయ జైత్ర యాత్ర కాస్తా ఎక్కడా బ్రేకులు లేకుండా కొనసాగింది. మొదట జగన్ ఎంపీగా తన తల్లి విజయమ్మ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ పెట్టాక గెలిచారు. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో మొత్తం 18 స్థానాలకు గానూ 15 గెలిచి సత్తా చాటుకున్నారు.

అదే ఊపులో 2014 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలను ఏపీలో జగన్ ఒంటి చేత్తో గెలిపించుకున్నారు. 2019 ఎన్నికల్లో అయితే 151 సీట్లతో రాజకీయ సంచలనమే సృష్టించారు. ఇదంతా వైసీపీ ఆరోహణ క్రమంగా చూడాలి.అంటే అలా పైపైకి ఎగబాకుతూ వైసీపీ గ్రాఫ్ ఎక్కడో నిలిచింది. అంతే కాదు ఒకే ఒక్క ఎంపీగా గెలిచిన జగన్ పార్టీ నుంచి 2019 ఎన్నికల నాటికి చూస్తే కనుక 22 మంది గెలిచారు అంటే గ్రేటెస్ట్ అనే అన్నారు అంతా. ఇక రాజ్యసభకు ఏపీ నుంచి 11 మంది కోటా ఉంటే మొత్తానికి మొత్తం వైసీపీతో నిండిపోయింది. అలా అదొక రికార్డు.

అదే విధంగా శాసన మండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 40 కి పైగా వైసీపీ వారే ఉండడమూ ఇంకో రికార్డు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి తొంబై అయిదు శాతం వైసీపీ వారే గెలిచి పదవులు అందుకున్నరు ఇలా కనుక చెప్పుకుంటే పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా ఎక్కడ చూసినా వైసీపీ వారే కనిపించారు. జగన్ కత్తికి ఎదురు లేకుండా అయిదేళ్ల కాలం గడచింది.

మరి వైసీపీ గ్రాఫ్ ప్రతీ ఎన్నికల్లో పెరుగుతూ వస్తోంది. 151 సీట్లు 2019లో గెలిస్తే 2024లో ఎన్ని సీట్లు గెలవాలి అంటే టోటల్ గా 175 అన్నారు. అదే వైసీపీ నినాదం అయింది. వై నాట్ 175 అంటూ వైసీపీ వినిపించిన ఈ రణనినాదం 2024 సార్వత్రిక ఎన్నికలో ప్రకంపనలు సృష్టించి తిరుగులేని విజయాన్ని మళ్లీ అందిస్తుంది అనుకుంటే బొమ్మ పూర్తిగా తిరగబడింది.

వైసీపీయే కాదు ఏ రాజకీయ సర్వేశ్వరుడూ మరే జ్యొస్తీష్యుడూ సైతం ఊహించని విధంగా కేవలం 11 సీట్లతో వైసీపీ చతికిలపడి పోయింది. ఈ అపజయంతో ఏకంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. వైసీపీ అంటే ఫైర్ అన్న వారే ఫ్లవర్ గా మారిందేంటి అని సెటైర్లు వేసే పరిస్థితి.

జగన్ అంటే గన్ అన్న వారే పేలని గన్ అని కామెంట్ చేసే స్థితి ఏర్పడ్డాయి.అలా 2024 ఏడాది అయితే వైసీపీకి జగన్ కి చేదునే తినిపించింది. ఈ ఏడాది వైసీపీకి రాజకీయంగా కలసి రాకపోతే కలత పెట్టేసింది. రాజకీయంగా శిఖరం మీద ఉన్న వైసీపీని పాతాళానికి తోసేసిన కేలండర్ ఇయర్ గా ఆ పార్టీ 2024ని గుర్తు చేసుకుంటోంది.

ఇంతింతై వటుడింతే అని అప్రతిహతంగా ఎదుగుతూ పోతున్న వైసీపీకి ఇది అతి పెద్ద దెబ్బగానే అంతా అభివర్ణించిన పరిస్థితి. ఆఖరుకు అసెంబ్లీకి సైతం వెళ్ళలేని విధంగా వైసీపీ రాజకీయ దైన్యం ఉంది. ఒకనాడు అసెంబ్లీ అంతటా పరచుకుని తిరుగులేని అధికారం చలాయించిన వైసీపీకి ఈసారి అసెంబ్లీలో బిక్కు బిక్కుమనే పరిస్థితి. జగన్ ప్రమాణ స్వీకారానికి సైతం వచ్చి తడబాటు పడిన తీరుని చూస్తే ఓడలు బళ్ళు సామెత గుర్తుకు వచ్చిందని విశ్లేషకులు అన్నారు.

ఓటమి తరువాత కూడా ఎటు చూసినా వైసీపీకి కలసిరాని పరిస్థితి ఉంది. పార్టీ నుంచి ఒక్కొక్కరూ జారుకుంటున్నారు. పోతూ పోతూ బండలేస్తున్నారు. ఎటూ వెళ్ళని వారు పార్టీలో గమ్మున ఉంటున్నారు. అంతటా ఒక రకమైన నిశ్శబ్ద వాతావరణం ఆవరించిన వేళ వెలుగు రేఖల కోసం 2025 వైపు ఆశగా వైసీపీ చూస్తోంది. కొత్త ఏడాది వైసీపీకి మేలు చేస్తుందా ఫ్యాన్ మళ్లీ గిర్రున తిరుగుతుందా అంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.