ఏలూరు జిల్లాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం.. 7 ప్రాణాలు పోయాయి
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఏపీలో చోటు చేసుకున్న ఒక ఘోర అగ్నిప్రమాదం ఏడు నిండు ప్రాణాల్ని తీసింది.
By: Tupaki Desk | 11 Sep 2024 4:52 AM GMTమంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఏపీలో చోటు చేసుకున్న ఒక ఘోర అగ్నిప్రమాదం ఏడు నిండు ప్రాణాల్ని తీసింది. ఉభయ గోదావరి జిల్లాల్ని అనుసంధానం చేసే రహదారి మీద జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. యమదూతగా మారిన మినీలారీ కారణంగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో నిడదవోలు మండలం తాడిమళ్లకు ఒక మినీ లారీ బయలుదేరింది.
అయితే.. మితిమీరిన వేగంతో వెళుతున్న ఈ మినీ లారీ.. దేవరపల్లి మండలం సమీపంలో అదుపు తప్పి తిరగబడింది. ప్రమాదం జరిగిన వేళలో.. మినీలారీలో మొత్తం 9 మంది ఉన్నారు. ప్రమాద వేళలో డ్రైవర్ తప్పించుకొని పరారయ్యాడు. వాహనం తిరగబడిన వేళలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకున్న ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన ఒకరిని మధుగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన లారీని.. అందులో చిక్కుకుపోయిన వారిని వెలికి తీశారు. మరణించిన ఏడుగురి వివరాల్ని సేకరించారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఒకరు తప్పించి మిగిలిన వారంతా 40-45 మధ్య వయస్కులే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరణించిన ఏడుగురు మినీ లారీలో ఎందుకు ఉన్నారు? వారెవరు? ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతున్నారు? లాంటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.