తెలంగాణ గవర్నర్ ఎంపికలో లెక్కలెన్నో ట్విస్ట్ ఏమంటే
అలాంటి ఆయన్ను తెలంగాణ గవర్నర్ గా ఎంపిక చేయటంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 28 July 2024 5:37 AM GMTతెలంగాణలో అంతకంతకూ బలపడుతున్న బీజేపీకి మరింత ఊపు తెచ్చేలా తాజా గవర్నర్ నియామకం జరిగినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనికి కారణం.. తాజాగా తెలంగాణకు గవర్నర్ గా వస్తున్న జిష్ణు దేవ్ వర్మ అసలుసిసలు రామభక్తుడు. అయోధ్య రామాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మాటకు వస్తే ఆయన రాజకీయ ఎంట్రీ అయోధ్య ఉద్యమంతోనే. అలాంటి ఆయన్ను తెలంగాణ గవర్నర్ గా ఎంపిక చేయటంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో మొదలైన బీఆర్ఎస్ డౌన్ ఫాల్ అంతకంతకూ విస్తరిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుచుకోని దైన్యం కారు పార్టీని వెంటాడుతోంది. అదే సమయంలో.. బీజేపీ మరింత బలపడుతూ ఏకంగా ఎనిమిది ఎంపీ స్థానాల్ని గెలుచుకోవటంతో కమలనాథులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలంగాణలో బీజేపీకి పట్టు పెరుగుతున్న వేళ.. రాజకీయ నేపథ్యంతో పాటు.. కరుడుకట్టిన రామభక్తుడ్ని తెలంగాణ గవర్నర్ గా ఎంపిక చేయటం ద్వారా కొత్త వ్యూహానికి కేంద్రం తెర తీసిందంటున్నారు.
రాజవంశీకుడైన జిష్ణుదేవ్ వర్మకు తగినంత రాజకీయ నేపథ్యం ఉండటం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు త్రిపురకు రెండో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన ఆయన రాకతో తెలంగాణలో బీజేపీ మరింత పట్టు బిగించే వీలుందంటున్నారు. అదే సమయంలో.. దూసుకెళుతున్న సీఎం రేవంత్ ను ఎప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో కొత్త గవర్నర్ కు ప్రత్యేకంగా ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.
ఈ ఎంపికలో మరో ట్విస్టు ఉంది. దీన్ని కో ఇన్సిడెంట్ అంటే మరింత బాగుంటుంది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్ గా కేంద్రం గతంలో నియమించింది. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమించటం ఆసక్తికరంగా మారింది. ఈ ఎంపిక అనంతరం రాజకీయ వర్గాల్లో వాటే కో ఇన్సిడెంట్ అని వ్యాఖ్యానిస్తున్నారు.