Begin typing your search above and press return to search.

సరిహద్దు దాటుతోన్న ప్రేమ... సమాజానికి సరికొత్త సమస్య?

సరిహద్దులు దాటుతోన్న సంఘటనలు గతకొన్ని రోజులుగా వరుసగా వెలుగులోకి వస్తోన్నాయి

By:  Tupaki Desk   |   29 July 2023 3:51 AM GMT
సరిహద్దు దాటుతోన్న ప్రేమ... సమాజానికి సరికొత్త సమస్య?
X

సోషల్ మీడియా పరిచయంతో ప్రేమో, ఆకర్షణమో, మోహమో, వ్యామోహమో... కారణం ఏదైనా, వారి వారి కుటుంబ పరిస్థితులు మరేవైనా... సరిహద్దులు దాటుతోన్న సంఘటనలు గతకొన్ని రోజులుగా వరుసగా వెలుగులోకి వస్తోన్నాయి. దీంతో ముఖ్యంగా సరిహద్దు దేశాలకు ఇవి పైకి కనిపించేవి మాత్రమే కాకుండా అంతర్గతంగా మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు.

పబ్ జీ ప్రేమ... పాక్ నుంచి ఇండియాకు:

అవును... సంచలనం సృష్టించిన పబ్ జీ ప్రేమ సంగతి తెలిసిందే. పెళ్లై నలుగురు పిల్లలున్న పాకిస్థాన్ మహిళ సీమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. భర్తతో విడాకులు తీసుకుని, వాటాగా వచ్చిన ఇంటిని అమ్ముకుని, నలుగురు పిల్లలను వెంటతీసుకుని దుబాయ్ వెళ్లి.. అక్కడ నుంచి నేపాల్ వచ్చి.. ప్రియుడిని కలుసుకుని.. నేరుగా ఢిల్లీలో వాలిపోయింది.

అప్పటికే ఆమెకోసం ఢిల్లీలో ఒక ఇల్లు తీసిపెట్టిన ప్రియుడు.. ఆమెను, ఆమె పిల్లలను సాదరంగా ఆహ్వానించాడు. అప్పటికే విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. పైగా ఆమెపై పలురకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆమెకు ఐ.ఎస్.ఐ. కు ఏమైనా సంబంధం ఉందే అనే కోణంలో విచారణ జరుగుతుందని వార్తలొస్తున్నాయి.

ఫేస్ బుక్ ప్రేమ... రాజస్థాన్ టు పాకిస్థాన్:

ఇదే క్రమంలో... అంజూ అనే 34 ఏళ్ల మహిళ రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిపోయింది. ఈ విషయంలో కూడా ఆన్ లైన్ లవ్వే కారణం. అవును... ఫేస్ బుక్ పరిచయం ఫలితంగా ఆమె భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిపోయింది. అక్కడ హిజాబ్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది! దీంతో ఆమె కుటుంబ సభ్యులపైనా, ఆ గ్రామం పైనా అధికారులు నిఘా పెట్టారు.

ఇదే సమయంలో ప్రియుడితో కలిసి పాక్ లో ఫోటో షూట్ లో పాల్గొంది. దీంతో అది ఆమె ప్రీ వెడ్డింగ్ షూట్ అని, ఆమెకు పెళ్లైపోయిందని, ఆమె మతం మార్చుకుందని, ఇక ఇండియాకు రాదని కథనాలొచ్చాయి. అయితే ఇంకా తనకు పాక్ లో పెళ్లికాలేదని.. ఆగస్టులో ఇండియాకు వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చింది.

స్నాప్ చాట్ పరిచయం... చైనా టు పాకిస్థాన్:

ఈ నేపథ్యంలో తాజాగా ఓ చైనా యువతి స్నాప్‌ చాట్‌ లో పరిచయమైన తన ప్రియుడి కోసం పాక్‌ లో అడుగుపెట్టింది. 21 ఏళ్ల చైనా యువతి గావ్‌ ఫెంగ్‌ మూడు నెలల వీసాపై పాకిస్థాన్‌ లోని ఇస్లామాబాద్‌ చేరుకుంది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ బజౌర్‌ ట్రైబల్‌ జిల్లాకు చెందిన యువకుడి కోసం ఆమె రోడ్డు మార్గం గుండా పాక్‌ వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు.. 18 ఏళ్ల జావేద్‌ ఆమెను కలుసుకున్నాడు. తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసు అధికారులు చైనా యువతి ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నట్లు గుర్తించామన్నారు. గావ్‌ ఫెంగ్‌ ను.. జావేద్‌ పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు.

అజయ్ - జూలీ... బంగ్లాదేశ్ టు భారత్:

తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌ కు చెందిన అజయ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు జూలీ అనే మహిళ బంగ్లాదేశ్‌ నుంచి వచ్చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం కూడా జరిగింది. వీరిద్దరి మధ్యా 2017లో ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2022లో జూలీ భర్త చనిపోయాడు. దీంతో అజయ్‌ సూచన మేరకు బంగ్లాదేశ్‌ నుంచి ఆమె భారత్‌ కు వచ్చేసింది.

అయితే, వృత్తి రీత్యా అతడు కర్ణాటకలో ఉండాల్సి రావడంతో.. భార్యను ఇంటి వద్దనే ఉంచాడు అజయ్. కొన్నాళ్లకు అత్తాకోడళ్ల మధ్య గొడవలు తలెత్తాయి. అవి తీవ్రం కావడంతో కోపంతో జూలీ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తల్లిపై కోపంతో అజయ్‌ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

తాజాగా బంగ్లాదేశ్‌ లో తన కుమారుడు నరకయాతన అనుభవిస్తున్నాడంటూ రక్తమోడుతున్న ఫొటోతో వెళ్లి అతడి తల్లి ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని భారత్‌ కు రప్పించారు.

వీళ్ల ప్రేమ కథల సంగతి అలా ఉంటే... సమాజంలో ఇలాంటి ప్రేమకథలు మరో విధమైన సందేశాన్ని తీసుకెళ్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో దేశ అంతర్గత భద్రతకు వీటిని సవాళ్లుగా పరిగణించాల్సిన అవసరం ఉందని అంటున్నారు!