ఏపీలో అమానుషం.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేం పని?
అలాంటిది ఒక భర్త తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు ఏకంగా శిరోముండనం చేసిన భర్త వ్యవహారం కలకలం రేపింది.
By: Tupaki Desk | 3 Feb 2024 5:34 AM GMTఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహ బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, అలకలు సహజం. అలాంటిది ఒక భర్త తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు ఏకంగా శిరోముండనం చేసిన భర్త వ్యవహారం కలకలం రేపింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు ఓ ప్రబుద్ధుడు శిరోముండనం చేశాడు. అనంతరం భార్య జుట్టును చేత్తో పట్టుకుని చూపుతూ సైకోలా ప్రవర్తించాడు.
ఆమెపై అనుమానంతోనే భార్యను చిత్ర హింసలు పెట్టి ఆమెకు గుండు గీసి భర్త పరారయ్యాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసే వ్యక్తి ,ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. స్థానిక పెద్ద మనుషుల పంచాయతీ పెట్టినా సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో ఇంటికి రాగా భార్యను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగక ఆమెకు గుండు గీసి జుట్టును తీసుకుని వెళ్ళిపోయాడు.
అనంతరం భార్య జుట్టును చేత్తో పట్టుకుని చూపుతూ ఊరంతా సైకోలా తిరుగుతూ పైశాచిక ఆనందం పొందాడు. కాగా తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు అత్తమామలు సిద్ధమయ్యారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసి పుట్టింటికి వచ్చిన తనపై భర్త దాడి చేశాడన్నారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో ద్వారా తన భర్త పెట్టిన బాధలను రికార్డు చేసింది.
కాగా భర్త చేతిలో చిత్రహింసలకు గురయిన బాధితురాలని చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. భర్త ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.