ఆ ఊర్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ట్యాక్స్ కట్టాలి... ఏమిటీ "కుట్ర వరీ"?
ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు అత్యంత సహజమైపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Jun 2024 5:30 PM GMTఈ రోజుల్లో ప్రేమ వివాహాలు అత్యంత సహజమైపోయిన సంగతి తెలిసిందే. కులమతాలకు అతీతంగా.. ధనిక పేద తారమత్యాలకు దూరంగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఇక విదేశీయులనూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న భారతీయుల సంఖ్యా పెరుగుతుంది. అయితే... వీటిలో సక్సెస్ రేటుపై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
పరిపక్వతతో కూడిన ప్రేమ, అర్థం చేసుకునే భాగస్వామ్యంతో కూడిన అనుబంధంతో ఒక్కటిచేసే ప్రేమ పెళ్లిల్లు నిండూ నూరేళ్లు ఉంటుండగా.. కొన్ని అపరిపక్వతతో, అవగాహన రాహిత్యంతో, అనుమానాలతో నడిచే ప్రేమలు, వాటి తాలూకు వివాహాలు మాత్రం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రేమ పెళ్లిని నేరంగా చూసే ఓ గ్రామం వెలుగులోకి వచ్చింది.
అవును... ప్రేమపెళ్లి చేసుకుంటే ట్యాక్స్ చెల్లించాలి.. కొన్ని సందర్భాల్లో ఇంటింటికీ వెళ్లి తప్పు చేశామని, క్షమించమని కోరాలి! అలాంటి గ్రామం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామంలో ఈ ప్రేమ వివాహాల విషయంలో ఉన్న కట్టుబాట్లు, ట్యాక్సులు, ఆ ట్యాక్సులు కట్టిన సొమ్మును వినియోగిస్తున్న విధానం ఆసక్తిగా మారింది. ఆ గ్రామం అక్కడుంది.. ఈ కథాకమీషేఇటి ఇప్పుడు చూద్దాం...!
వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఓ జంట. అయితే... ఆ ప్రాంతంలో ప్రేమ వివాహాలు చేసుకున్న్వారికి కొన్ని తరాల నుంచి "కుట్ర వరీ" (క్రైం ట్యాక్స్) విధిస్తున్నారు. ఒక వేళ గ్రామ కట్టుబాటును కాదని ఆ పన్ను చెల్లించని పక్షంలో, పెద్దల మాటకు అంగీకరించని నేపథ్యంలో... వారిని ఆ గ్రామం నుంచి బహిష్కరిస్తారు.
అలా కాకుండా ట్యాక్స్ కు అంగీకరిస్తే... గ్రామ పెద్దల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పి రూ.500 ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో... ఆ గ్రామంలోని ఇంటింటికీ తిరిగి.. తప్పు చేశానని క్షమాపణలు కోరాల్సి ఉంటుంది. అయితే... చాలా మంది ఈ కట్టుబాటును దప్పుబడుతుంటే... మరికొంతమంది మాత్రం ఈ ట్యాక్స్ ని ఆలయ అభివృద్ధికి వెచ్చిస్తున్నామని.. ఇందులో తప్పేమీ లేదని సమర్థిస్తున్నారు.