Begin typing your search above and press return to search.

ప్రేమ పెళ్లి.. సూసైడ్.. అనాథలైన ఇద్దరు చిన్నారులు

నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన నాగరాజు.. సురేఖలు ఇద్దరు భార్యభర్తలు. నాగరాజుకు 23 ఏళ్లు అయితే.. సురేఖకు 21 ఏళ్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 5:49 AM GMT
ప్రేమ పెళ్లి.. సూసైడ్.. అనాథలైన ఇద్దరు చిన్నారులు
X

ఇష్టం ఉండగానే సరిపోదు. కమిట్ మెంట్ అంతే ముఖ్యం. ప్రేమకు సవాళ్లు ఎదురవుతాయి. కలకాలం కలిసి ఉంటామన్న బాసలు.. కష్టంలోనూ గుర్తుండాలి. కానీ.. వాస్తవంలో అలా జరగదు. అలా జరగని కారణంగా ఆ ప్రేమికులు ఇద్దరి జీవితాలు ప్రభావితం అయితే ఫర్లేదనుకోవచ్చు. కానీ.. వారి కారణంగా పుట్టే పిల్లలకు అన్యాయం జరగొద్దు. కానీ.. నెల్లూరులో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే అయ్యో అనిపించటమేకాదు.. తెలియని విషాదం కమ్మేస్తుంది. ఇద్దరు ప్రేమికుల తప్పులకు సంబంధం లేని ఇద్దరు చిన్నారులు జీవితాంతం వేదనను అనుభవించాల్సిన దుస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్ లో విలన్ మద్యం కావటం గమనార్హం.

నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన నాగరాజు.. సురేఖలు ఇద్దరు భార్యభర్తలు. నాగరాజుకు 23 ఏళ్లు అయితే.. సురేఖకు 21 ఏళ్లుగా చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం వీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నాగరాజు టైల్స్ పనులు చేస్తుంటే.. సురేఖ బ్యూటీపార్లర్ లో బ్యూటీషియన్ గా పని చేస్తూ ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకరికి మూడేళ్లు.. మరొకరికి పదకొండు నెలలు. వీరి కుటుంబాలనే కాదు జీవితాల్ని పాడు మందు నాశనం చేసింది. నాగరాజు సంపాదించిన మొత్తం డబ్బుల్ని తీసుకొని పోయి మద్యాన్ని కొనేవాడు. అందినకాడికి అప్పులు చేసేవాడు.

దీంతో కుటుంబ భారం సురేఖ మీద పడింది. మందు తాగేయాలని.. కుటుంబం మీద ఫోకస్ పెట్టాలంటూ పలుమార్లు భర్తను ప్రాధేయపడింది. అయినా.. అతడిలో మార్పురాలేదు. మద్యానికి డబ్బు లేకపోతే.. పుట్టింటికి వెళ్లి తీసుకురావాలంటూ ఒత్తిడి చేసేవాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పట్టించుకోలేదన్న బాధ.. మరోవైపు ఇద్దరు పిల్లల బాధ్యత బరువుతో కుంగిపోయింది.

దీంతో.. ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఉరి వేసుకున్నది గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చారు. పని మీద బయటకు వెళ్లిన నాగరాజుకు తన భార్య ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసినంతనే.. తన వల్లే ఇలా అయ్యిందని.. ఆమె లేని తాను బతకలేనంటూ పక్కనే ఉన్న విజయమహల్ గేటు రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి కారణంగా చిన్నారులు ఇద్దరు అనాధలయ్యారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో అన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.