దిగజారుడు రాజకీయాలు... ఏపీలో కండో*మ్స్ తో ప్రచారాలు!
ఇందులో భాగంగా... తాజాగా... "భవిష్యత్తుకు గ్యారెంటీ" పేరుతో టీడీపీ నేతలు, "సిద్ధం" సభల పేరుతో వైసీపీ నాయకులు కండో*మ్ ప్యాకెట్లు పంచుతున్నారంటూ రెండు పార్టీలు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నాయి.
By: Tupaki Desk | 22 Feb 2024 5:32 AM GMTఇటీవల కాలంలో రాజకీయాలు మరీ దిగజారిపోతున్నాయి.. ఇంక దిగజారడానికి ఏమీ లేదు అన్నంతగా దిగజారిపోతున్నాయనే కామెంట్లు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నేతలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల దగ్గర నుంచి.. పక్క పార్టీలో గెలిచిన వారిని నిసిగ్గుగా కండువాలు కప్పి కొనుక్కునే పరిస్థితి వరకూ మాగ్జిమం దిగజారిపోయాయనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
పైగా ఇటీవల కాలంలో ఎవరి గురించి వారు ఎక్కువగా చెప్పుకోవడం కంటే.. ప్రత్యర్థులపై బురదజల్లడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! ఇక తిట్ల పురాణంలో భాగంగా వదులుతున్న ఆణిముత్యాల సంగతి చెప్పే పనేలేదు! చూపించేవాడికి శక్తి, వినేవాడికి ఓపిక ఉండాలే కానీ... ఎంతసేపైనా ఆ తిట్ల పురాణాలు, బూతుల పంచాంగాలూ వినిపిస్తూనే ఉంటాయని చెబుతుంటారు. ఈ క్రమంలో మరింత దిగజారిపోయిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
అవును... నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, ఫ్యామిలీ మెంబర్స్ ని సైతం టార్గెట్ చేస్తూ చేసే తిట్లు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే పనికి మాలిన ప్రయత్నాల నడుమ తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. దిగజారడానికి ఇంక ఏమీ లేదు అన్నట్లుగా కండో*మ్ ప్యాకెట్లతో ప్రత్యర్థులపై బురదజల్లే ప్రయత్నాలు, వారి స్థాయిని దిగజార్చే విన్యాశాలు తెరపైకి వచ్చాయని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... తాజాగా... "భవిష్యత్తుకు గ్యారెంటీ" పేరుతో టీడీపీ నేతలు, "సిద్ధం" సభల పేరుతో వైసీపీ నాయకులు కండో*మ్ ప్యాకెట్లు పంచుతున్నారంటూ రెండు పార్టీలు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నాయి. దీంతో దిగజారడమంటే మరీ ఇంతల దిగజారాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. భారీగా చీత్కరిస్తున్నారు ప్రజలు!
దీంతో ఈ విషయంపై ఆన్ లైన్ వేదికగా స్పందించిన టీడీపీ... "సిద్ధం.. సిద్ధం అంటూ కేకలు పెట్టేది ఇందుకా? ఇలాంటి నీచపు ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా" అని స్పందించింది.
ఇదే సమయంలో... "తమ పార్టీ ప్రచారం కోసం చివరికి ప్రజలకు కం*డోమ్ లు కూడా పంపిణీ చేస్తోంది టీడీపీ. ఇదెక్కడి ప్రచార పిచ్చి? నెక్ట్స్ వయా*గ్రాలు కూడా పంచుతారేమో? కనీసం అక్కడితోనైనా ఆగుతారా? లేకపోతే మున్ముందు ఇంకా దిగజారుతారా?" అంటూ వైసీపీ రియాక్ట్ అయ్యింది.