చంద్రబాబుపై కేంద్రం 'బండ' భారం!
కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల ధరలు.. కూటమి సర్కారుకు శాపంగా పరిణమించాయి.
By: Tupaki Desk | 7 April 2025 3:22 PMకేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల ధరలు.. కూటమి సర్కారుకు శాపంగా పరిణమించాయి. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్(డొమెస్టిక్) ధరలను రూ.50 చొప్పున పెంచింది. దీంతో ఏపీపై ఇది రూ.కోట్లలోనే భారంగా మారనుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు.. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నారు. సుమారు 32 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
ఏటా మూడు సిలిండ్లను కూటమి సర్కారు అందిస్తోంది. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి అందించే ఈ సిలిండర్ల ద్వారా పేదల కుటుంబాల్లో గ్యాస్ ధరల భారం తగ్గిస్తామని.. ఎన్నికలసమయంలో చంద్రబాబు ప్రకటించారు. చెప్పినట్టుగానే గత ఏడాది దసరా రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 841 కోట్ల రూపాయలను ఈ పథకానికి ఖర్చుచేశారు. అప్పట్లో గ్యాస్ ధర.. రూ.861-870 మధ్య ఉంది. దీనిలో కేంద్రం ఇచ్చే సబ్సిడీ రూ.15-17 మధ్యే ఉంటోంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రబుత్వం ఉచిత గ్యాస్ పథకం లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తోంది.
తాజాగా ఈ నెల 1వ తేదీ నుంచి రెండో విడత సిలిండర్ బుక్ చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రచారం చేసింది. దీనికి కాల పరిమితి నాలుగు మాసాల వరకు ఉంటుంది. అయితే.. ఇప్పటి వరకు అంటే.. ఈ ఏడు రోజుల్లో కేవలం తక్కువగానే బుక్ చేసుకున్నారు. ఈ నెల 10 నుంచి ఉచిత గ్యాస్ బుకింగులు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసుకుని.. గతంలో ఇచ్చినట్టే రూ.841 కోట్లను ఆయా ఏజెన్సీల ఖాతాల్లో జమ చేసేందుకు రెడీ అయింది.
కానీ, ఇంతలోనే.. కేంద్రం రూ.50 చోప్పున ఒక్కొక్క సిలిండర్‌కు ధరలను పెంచడంతో ఇప్పుడు ఆ భారం కాస్తా.. మరో 200 కోట్లకు చేరనుంది. దీంతో ఈ నెలలోనే 1050 కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనా.. కేంద్రం పెంచిన ధరలతో ఉచిత గ్యాస్‌ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ భారం పడిందనే చెప్పాలి. ఇక, ఈ ఉచిత గ్యాస్ పథకానికి కేంద్రం ఎలాంటి సాయం అందించడం లేదన్న విషయం తెలిసిందే.