Begin typing your search above and press return to search.

ఉచితాలు/సంక్షేమ పథకాలు.. అటు సుప్రీం.. ఇటు ఎల్ అండ్ టీ చైర్మన్!

ఈ నేపథ్యంలో ఒకే రోజు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన వ్యాఖ్యాలు చర్చనీయం అయ్యాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2025 11:30 PM GMT
ఉచితాలు/సంక్షేమ పథకాలు.. అటు సుప్రీం.. ఇటు ఎల్ అండ్ టీ చైర్మన్!
X

భారత్ వంటి పెద్ద దేశంలో.. అనేక ప్రాంతాలు.. వాటిలోనూ భిన్నత్వం ఉన్న దేశంలో పేదరికం ఓ పెద్ద సమస్య.. శతాబ్దాల పాటు బ్రిటిష్ పాలన పాపం కూడా ఇందులో ఉంది. అందుకనే రెండు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు ‘ఉచిత పథకాల’ను ఎన్నికల హామీలుగా ప్రజల ముందుకుతెస్తున్నాయి. అయితే, ఇవి మితి మీరుతున్నాయనే అభిప్రాయాలు, విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే రోజు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన వ్యాఖ్యాలు చర్చనీయం అయ్యాయి.

అర్బన్స్ లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు..

ఉచిత పథకాలు మంచివి కాదని.. దురదృష్టవశాత్తూ వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదని పేర్కొంది. రేషన్‌, డబ్బులు ఫ్రీగా వస్తున్నాయని.. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినా, ఉచిత పథకాల ద్వారా వారిని అభివృద్ధిలో భాగం చేయడం అనేది జరుగుతోందా..? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరికాదని జస్టిస్‌ బీఆర్‌ గవై, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మరోవైపు వారానికి 90 గంటలు పనిచేయాలని.. ఆదివారాలూ పనిచేయండి.. ఇంట్లో భార్యలను చూస్తూ ఎంతసేపు కూర్చుకుంటారని గతంలో వ్యాఖ్యాలు చేసి విమర్శలు మూటగట్టుకున్న ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ తాజాగా మరోసారి వివాదంలో నిలిచారు. ప్రముఖ నిర్మాణ సంస్థ చైర్మన్ గా ఆయన.. నిర్మాణ రంగంలో కార్మికులు దొరకకపోవడానికి కారణం సంక్షేమ పథకాలే అని నిందించారు. వాటి వల్లే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడడం లేదన్నారు.

నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడానికి సంక్షేమ పథకాలే కారణమని నిందించారు. సుబ్రహ్మణ్యన్ ఈ వ్యాఖ్యలను చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో చేయడం గమనార్హం.

కార్మికుల్లో మాత్రమే కాదని.. వైట్‌ కాలర్‌ ఉద్యోగులూ వేరే చోటకు వెళ్లమంటే నో చెప్పేస్తున్నారని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు. తాను చేరిన కొత్తలో ఢిల్లీ వెళ్లమంటే ఓకే అనేవారని.. ఇప్పుడు మాత్రం బై చెప్పేస్తున్నారని వ్యాఖ్యానించారు.