Begin typing your search above and press return to search.

ఎంతటి మానవత్వం ఉన్నోళ్లు కూడా ఈమె చేసిన పనిని క్షమించరు

పసిగుడ్డుల ప్రాణాల్ని తీసే ఈ ఉన్మాది.. కేవలం వారిని చూసుకోవటం తనకు సాధ్యం కాదన్న పేరుతో వారి ఊసురు తీసిన వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:41 AM GMT
ఎంతటి మానవత్వం ఉన్నోళ్లు కూడా ఈమె చేసిన పనిని క్షమించరు
X

అప్పుడే పుట్టిన పిల్లల్ని పట్టుకోవాలంటే చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే.. అంత సున్నితంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా వారిని పట్టుకోవటం.. అత్యంత అప్రమత్తంగా ఉండటం చేశారు. అలాంటిది రోజుల పిల్లల్ని అత్యంత కర్కశంగా చంపేసే రాక్షసత్వం ఇప్పుడు చెప్పే మహిళ సొంతం. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన రోజుల పిల్లల్ని.. అత్యంత దారుణ పద్దతిలో చంపేసి.. మానవత్వానికే తలవంపులు తెచ్చిన ఈ రాక్షస నర్సుకు శిక్ష పడే రోజులు దగ్గర్లోకి వచ్చేసింది.

పసిగుడ్డుల ప్రాణాల్ని తీసే ఈ ఉన్మాది.. కేవలం వారిని చూసుకోవటం తనకు సాధ్యం కాదన్న పేరుతో వారి ఊసురు తీసిన వైనం షాకింగ్ గా మారింది. ఏడుగురు శిశువుల ప్రాణాల్ని తీసిన ఈ ఉన్మాది లండన్ కు చెందిన లూసీ లెబ్టీ. తాజాగా ఈమె చేసిన రాక్షసకాండ నిరూపితమైంది. ఆమెకు ఎలాంటి శిక్ష విధించాలన్న దానిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. 2015-16 మధ్య కాలంలో ఆమె విధుల్లో ఉన్న వార్డుల్లోని నవజాత శిశువులు ఆకస్మికంగా చనిపోవటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

దీనిపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వటం.. రంగంలోకి దిగిన పోలీసులు 2017లో శిశువుల మరణాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో లూసీ పిల్లల వార్డుల్లో నర్సుగా విధులు నిర్వహించే సమయంలోనూ ఈ అనుమానాస్పద మరణాలు జరిగినట్లుగా గుర్తించారు. ఇదే సమయంలో భారత మూలాలు ఉన్న వైద్యుడి పైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. లూసీ నివాసంలో తనిఖీలు నిర్వహించిన వేళలో.. పోలీసులకు షాకింగ్ అంశాల్ని గుర్తించారు.

తాను చెడ్డదానినని.. తానే చిన్నారుల్ని చంపేశానని.. వారిని చూసుకునేంత మంచిదానిని కాదని.. అందుకే చంపేసినట్లుగా పేర్కొన్నారు. ఇక.. శిశువుల మరణాలు ఎలా జరిగాయన్న దానిపై విచారణ జరపగా.. ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపటం.. నాసో గ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా కడుపులోకి పాలు.. నీటిని బలవంతంగా పంపటం.. శ్వాస నాళాలకు అంతరాయం కలిగించటంలాంటి పనులు చేపట్టి.. ప్రాణాలు తీసిన వైనాన్ని గుర్తించారు. మనిషి అనే వారు చేయని దారుణాలకు ఒడిగట్టిన ఈ రాక్షసికి ఎంతటి శిక్ష విధించినా తక్కువే అవుతుందని చెప్పకతప్పదు.