సేమ్ టు సేమ్: 'బ్రో' సీన్ అక్కడ రిపీట్!
ఈ మధ్యన విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సాయిధరమ్ తేజ నటించిన బ్రో మూవీ గురించి తెలిసిందే
By: Tupaki Desk | 21 Sep 2023 4:36 AM GMTఈ మధ్యన విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సాయిధరమ్ తేజ నటించిన బ్రో మూవీ గురించి తెలిసిందే. తమిళంలోని వనోదయ సిత్తం మూవీకి రీమేక్ చేసిన ఈ సినిమాలోని ఒక సన్నివేశం అచ్చుగుద్దినట్లుగా రిపీట్ అయిన ఆసక్తికర ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. మూవీలో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురై చనిపోవటం.. అతగాడు ''టైం'' వద్దకు వెళ్లటం.. ఆ టైం మహానుభావుడు అతడికి మరోసారి బతికే అవకాశం ఇవ్వటం.. అదే సమయంలో భూమి మీద ఆసుపత్రిలోని పోస్టుమార్టం రూంలో ఉన్న సాయిధరమ్ బాడీకి పోస్టుమార్టం చేసేందుకు సిద్ధం కావటం.. కాల మహిమతో సాయి ధరమ్ బతికేయటం.. ఆ సందర్భంగా చూసిన సీన్ గురించి తెలిసిందే.
తాజాగా.. పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో దాదాపుగా అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. పోస్ట్ మార్టం కోసం తరలిస్తున్న ఒక పోలీసు అధికారి దేహంలో కదలికతో మిగిలిన వారంతా ఉలిక్కిపడిన ఉదంతం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. సినిమాలో మాదిరి కాకుండా.. ఆ పోలీసు అధికారిని వెంటనే మరో ఆసుపత్రికి తరలించి ప్రాణాల్ని కాపాడారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
పోలీసు అధికారిగా వ్యవహరించే మన్ ప్రీత్ ను ఒక విష పురుగు కుట్టింది. ఆ వెంటనే ఆయన్ను లూథియానాలోని బస్సీ హాస్పిటల్ లో చేర్చారు. అయితే.. అతని బాడీ మొత్తం ఇన్ ఫెక్షన్ సోకటంతో వెంటిలేటర్ పై ఉంచి వైద్యం చేశారు. అయితే.. అతను సెప్టెంబరు 18న మరణించినట్లుగా ఆసుపత్రి సిబ్బంది తేల్చారు. దీంతో.. అతన్ని తర్వాతి రోజు పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఒక పోలీసు అధికారి మన్ ప్రీత్ బాడీలో కదలికల్ని గుర్తించాడు. వెంటనే.. వైద్యుల్ని అలెర్టు చేయగా.. ఆయన్ను మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసు అధికారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మన్ ప్రీత్ చనిపోయినట్లుగా తమ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు తమను తాము సమర్థించుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఒకవేళ.. చనిపోయినట్లు చెప్పకుంటే.. పోస్టుమార్టంకు ఎందుకు తీసుకెళుతున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు.