Begin typing your search above and press return to search.

జగన్‌ హయాంలో పోయింది.. బాబు హయాంలో వచ్చింది!

ప్రముఖ కంపెనీ.. లులూ గ్రూప్‌ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ కు తిరిగొచ్చింది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 7:14 AM GMT
జగన్‌ హయాంలో పోయింది.. బాబు హయాంలో వచ్చింది!
X

ప్రముఖ కంపెనీ.. లులూ గ్రూప్‌ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ కు తిరిగొచ్చింది. ఏపీలో అతిపెద్ద నగరమైన విశాఖలో భారీ మెగా మాల్‌ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లులూ ఒప్పందం చేసుకుంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ గ్రూప్‌ కు భూములు కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లులూకు భూములు కేటాయించడంలో అవినీతి జరిగిందంటూ ఆ ప్రాజెక్టును రద్దు చేసింది.

దీంతో లులూ గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోయింది. దీంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. లులూ గ్రూప్‌ మెగా మాల్, మల్టీఫ్లెక్స్‌ నిర్మాణం చేపట్టి ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు దక్కేవి. అయితే రివర్స్‌ టెండరింగ్, పెట్టుబడిదారీ వ్యతిరేక విధానాలతో జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక మంచి కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే దాన్ని తరిమేశారని నెటిజన్లు విమర్శలు చేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో లులూ గ్రూప్‌ మళ్లీ రాష్ట్రానికి తిరిగొచ్చింది. ఈ మేరకు ఆ గ్రూప్‌ చైర్మన్‌ ఎండీ యూసుఫ్‌ అలీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అష్రఫ్‌ అలీ ఎంఏ.. తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ‘లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ – ఎండీ యూసుఫ్‌ అలీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అష్రఫ్‌ అలీ ఎంఏను ఆంధ్రప్రదేశ్‌ కి తిరిగి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’ అని తన ట్వీట్‌ లో ఆయన పేర్కొన్నారు.

లులూ గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌ లో ఆహార శుద్ధి (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) రంగంలో పెట్టుబడులు పెడుతుంది. అలాగే విశాఖపట్నంలో ఒక మెగా మాల్‌ తోపాటు మల్లీప్లెక్స్‌ ను నిర్మించనుంది. అలాగే విజయవాడ, తిరుపతి నగరాల్లో హైపర్‌ మార్కెట్ల ఏర్పాటు, మల్లీఫ్లెక్స్‌ ల ఏర్పాటుపై చంద్రబాబుతో లులూ గ్రూప్‌ ప్రతినిధులు చర్చించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్న లులూ గ్రూప్‌ కు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చంద్రబాబు గ్రూప్‌ చైర్మన్‌ కు హామీ ఇచ్చారు.

ఈ మేరకు చంద్రబాబు తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

కాగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం లులూ గ్రూప్‌ కు కేటాయించని భూమి ఇప్పటికీ అలాగే ఉంది. ఆ భూమిని తిరిగి లులూ గ్రూప్‌ కు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించనుంది. ఈ నేపథ్యంలో లులూ అక్కడ మెగా మాల్, మల్టీఫ్లెక్స్‌ నిర్మిస్తే వైసీపీకి గట్టి దెబ్బేనని అంటున్నారు.