వైజాగ్ కు ఇంటర్నేషనల్ బ్రాండ్.. లులు మాల్ కు లైన్ క్లియర్
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఇంటర్నేషనల్ మాల్ ఏర్పాటు కానుంది. లులు గ్రూపుతో జరిగిన ఒప్పందం మేరకు ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో సుమారు 13.43 ఎకరాలను కేటాయించింది.
By: Tupaki Desk | 27 March 2025 10:37 AMరాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఇంటర్నేషనల్ మాల్ ఏర్పాటు కానుంది. లులు గ్రూపుతో జరిగిన ఒప్పందం మేరకు ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో సుమారు 13.43 ఎకరాలను కేటాయించింది. దీంతో రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయిన లులు మాల్ మళ్లీ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. 2018లోనే విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కురుర్చుకుంది. భూ కేటాయింపులు కూడా చేసింది. అయితే 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వ విధానాలతో విశాఖలో మాల్ ఏర్పాటును లులు ఉపశంహరించుకుంది. అదే సమయంలో హైదరాబాద్ లో తన మాల్ ప్రారంభించింది. అయితే గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ కొలువుదీరిన తర్వాత లులు మాల్ ఏర్పాటుకు మళ్లీ అడుగులు వేసింది.
విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచస్థాయి సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా లులు మాల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు. 2018లోనే ఈ ప్రక్రియ మొదలైనా గత ప్రభుత్వం వల్ల లులు ఏర్పాటు కల సాకారం కాలేదు. అయితే గత ఏడాది సెప్టెంబరులో లులు గ్రూపు ఇంటర్నేషనల్ ఎండీ ఎంఏ యాసఫ్ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన ఆసక్తిని తెలియజేశారు. దీంతో వెంటనే లులు మాల్ ఏర్పాటుకు భూములు కేటాయించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు వీఎంఆర్డీఏకి ఆదేశాలు జారీ చేశారు.
విశాఖలో ఏర్పాటుకానున్న లులు మాల్ లో ప్రపంచ స్థాయి హైపర్ మార్కెట్, ఫంచురా పిల్లల వినోద కేంద్రం, చక్కటి భోజన సౌకర్యాలతో ఫుడ్ కోర్టు, 8 స్క్రీన్ల ఐ మ్యాక్స్ థియేటర్స్ తో మెగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ఈ మాల్ కోసం వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్ ప్రాంతంలోని 13.43 ఎకరాల భూమిని కేటాయిస్తూ బుధవారం ఏపీఐఐసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు రెడ్ కార్పెట్ పరిచినట్లైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నట్లు విశాఖలో అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో మాల్ ఏర్పాటైతే పర్యాటకంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. లులు మాల్ ద్వారా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.