Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో లులు మానియా... లాంగ్ వీకెండ్ చేసిన పని ఇదే!

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్న హైదరాబాద్ లో అంతర్జాతీయ షాపింగ్ మాల్స్ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Oct 2023 7:43 AM GMT
హైదరాబాద్‌  లో లులు మానియా... లాంగ్  వీకెండ్  చేసిన పని ఇదే!
X

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్న హైదరాబాద్ లో అంతర్జాతీయ షాపింగ్ మాల్స్ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ ఫర్నిచర్ బ్రాండ్ ఐకియా సిటీలో దుకాణాన్ని ప్రారంభించింది. దీంతో ఇది వ్యాపార సముదాయంగానే కాకుండా వీకెండ్ టూరిస్ట్ స్పాట్ గా కూడా మారిన పరిస్థితి!

ఇదే సమయంలో దుర్గం చెరువూ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన సమయంలో ఆ ప్రాంతమంతా వీకెండ్ అయితే చాలు ఫుల్ రద్దీగా ఉండేది. ఈ సమయంలో గాంధీ జయంతిని పురష్కరించుకుని సిటీ జనాలకు లాంగ్ వీకెండ్ వచ్చింది. శని, ఆది, సోమవారాలు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో చిన్నా పెద్దా అనే తారతమ్యాలేమీ లేకుండా.. అంతా ఒకేవైపు క్యూ కట్టారు. అదే లులూ మాల్!!

అవును... పెద్దగా పబ్లిసిటీ చేయకుండా ప్రారంభమైనట్లు కనిపించినా హైదరాబాద్‌ లో లులు మాల్ కు నగర వాసులు పోటెత్తుతున్నారు. దీనికి కారణం అంతర్జాతీయంగా షాపింగ్ మాల్స్ లో లులుకు ప్రత్యేకమైన స్థానం ఉండటమే. దీంతో ఈ మాల్ ప్రారంభమైన రోజు నుంచీ జనం పోటెత్తుతున్నారు. ఇక వీకెండ్, హాలిడేస్ వస్తే చెప్పేపనే లేదు!

దీంతో కూకట్ పల్లి జే.ఎన్.టి.యూ. రోడ్డు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మాల్‌కు వెళ్లే వాహనాలతో కూకట్‌ పల్లి, బాలానగర్‌, వై జంక్షన్‌ వీధుల్లో ట్రాఫిక్‌ ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. కేవలం రెండు కిలోమీటర్లు దాటాలంటే సుమారు గంటన్నర నుంచి రెండు గంటలు సమయం పడుతుందంటే పరిస్థ్తి అర్ధంచేసుకోవచ్చు. ఇక ఆ సమయంలో ఒక మోస్తరు వర్షం పడితే... ఎవరి ఊహకు వారికి వదిలేయడమే!

ఈ మాల్ కారణంగా... ఎన్.హెచ్.65 హై ట్రాఫిక్‌ ను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మెట్రో పిల్లర్ ఏ906 నుంచి పిల్లర్ ఏ713 వరకు ట్రాఫిక్ చెప్పలేని, చెప్పుకోలేని స్థాయిలో ఉంటుంది. దీంతో... కూకట్ పల్లి మొత్తం స్తంభించిపోతోంది. దీంతో... గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాల్ ఓపెనింగ్ సమయంలోనే... ట్రాఫిక్ విషయంలో పోలీసులు ప్రత్యామ్నాయలపై దృష్టి సారించాల్సిందనే మాటలు వినిపిస్తున్నాయి!

రోడ్లపై పరిస్థితి ఇలా ఉంటే... మాల్ లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు! విపరీతంగా వస్తోన్న జనంతో మాల్ మొత్తం కిక్కిరిసిపోతోంది. విపరీతమైన రద్దీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్‌ లోడ్ కారణంగా ఎస్కలేటర్లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇక పార్కింగ్ లో వెహికల్ పెట్టే విషయంలోనూ, తీసే విషయంలోనూ ఎవరి అనుభవం వారిది! అందుకే.. ఆ రోడ్డువైపు వెళ్తుంటే కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!