మీరు చదువుతున్నది నిజమే.. బంగారం చాయ్.. ఎక్కడంటే?
అవును.. వ్యాపారం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదు. అందులోనూ ‘బంగారం’ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు చెప్పండి
By: Tupaki Desk | 16 Dec 2024 6:30 AM GMTఅవును.. వ్యాపారం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదు. అందులోనూ ‘బంగారం’ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు చెప్పండి. సత్తికాలంలో డబ్బుల్ని తింటామా? అనేటోళ్లు. కానీ.. ఇప్పుడుజేబులో డబ్బులు ఉండాలే కానీ.. ఎన్ని రకాలుగా తినాలో అన్ని రకాలుగా తినే వీలుంది. చివరకు బంగారాన్ని సైతం తాగేసే సరికొత్త చాయ్ ను సిద్ధం చేశారు దుబాయ్ లో. చదివినంతనే వావ్.. భలేగా ఉందనిపించే ఈ విషయంలోకి వెళితే..
బంగారంతో టీని తయారు చేసే కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ బంగారం టీ.. బంగారం కాఫీని సర్వే చేస్తున్నారు. అయితే.. దీని రుచిని అస్వాదించాలంటే మాత్రం భారీగానే ఖర్చు చేయాలి. మరి.. బంగారం టీ తాగటానికి ఆ మాత్రం ఖర్చు కాదా? అనుకోవచ్చు. కానీ.. దీని ధర సంపన్నులు సైతం కాసింత ఆలోచించేలా ఉండటం గమనార్హం.
బంగారంతో చేసిన కప్పు టీ కోసం రూ.1.14 లక్షలు ఖర్చు చేయాల్సిందే. అదే బంగారం కాఫీ కోసం రూ.1.09 లక్షలు వదిలించుకుంటే తప్పించి దాన్ని టేస్ట్ చేయలేం. ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ లో ఏర్పాటు చేసిన బోహో కేఫ్ లో ఈ బంగారం టీ.. కాఫీలను సర్వ్ చేస్తున్నారు. ఇంతకూ ఈ ఐడియా ఎవరికి వ చ్చిందంటే.. భారత మూలాలు ఉన్న సుచేత శర్మ అనే మహిళ ఈ హోటల్ ను రన్ చేస్తున్నారు.
బంగారం టీలో 24 క్యారెట్ల మేలిమి బంగారం పొడిని చల్లి.. టీని వెండి కప్పులో ఇస్తారని చెబుతున్నారు. ఈ బంగారం టీ.. కాఫీ కోసం ఆర్డర్ చేసిన వారికి ఫ్రెంచ్ వంటకాన్ని కూడా సర్వ్ చేస్తారు. కొసమెరుపు ఏమంటే.. కాఫీ /టీ సర్వ్ చేసే కప్పు.. సాసర్ తో పాటు ఫ్రెంచ్ వంటకాన్ని సర్వ్ చేసే వెండి ప్లేట్ ను మన వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు.
ఇక్కడ బంగారం ఐస్ క్రీం.. బంగారం బెవరేజ్ లు కూడా సర్వ్ చేస్తారు. విలాసాలు కోరుకునే వారికి.. ఏదైనా అసాధారణమైన పనులు చేయాలన్న టేస్టు ఉన్న వారి కోసమే తమ ఉత్పత్తులు అని చెబుతోంది సుచేత శర్మ. అయితే.. ఇక్కడకు కేవలం ఓ రేంజ్ కస్టమర్లు మాత్రమే వెళతారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకుంటే.. ఇక్కడ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ను అందుబాటు ధరల్లో అందిస్తుంటారు. దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసేటోళ్లు.. ఒక లుక్ వేసి వస్తే బాగుంటుంది కదా.