జగన్ టార్గెట్ చేస్తే సీన్ ఇలా ఉంటుందట!
తాజాగా ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో జగన్ వ్యవహారశైలిపై ఆయన కీలక అంశాల్నివెల్లడించారు.
By: Tupaki Desk | 30 Jun 2024 5:34 AM GMTఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలెన్నో బయటకు వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఆయన గురించి.. ఆయన నిర్ణయాల గురించి బయటకు చెప్పేందుకు సాహసించని పలువురు ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. కీలక అంశాల విషయంలో ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి? సీనియర్ అధికారులు సలహాలు ఇస్తే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగేందుకు ఎలా బిహేవ్ చేస్తుంటారన్న విషయాలపై కాస్త క్లారిటీ వచ్చేలా మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. తాజాగా ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో జగన్ వ్యవహారశైలిపై ఆయన కీలక అంశాల్నివెల్లడించారు.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో కొంతకాలం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం.. రాజధాని ఏర్పాటు అంశంలో జగన్ చేసిన ఒక ఆలోచనకు సంబంధించిన సంచలన విషయాన్ని వెల్లడించారు. ‘‘విశాఖపట్నంలోని స్టీల్ ఫ్లాంట్ ను ఆ నగరం నుంచి 20 కిలోమీటర్ల దూరానికి తరలించి.. ఆ భూముల్లో రాజధాని కట్టాలని జగన్ చెప్పినప్పుడు షాక్ తిన్నాను. అక్కడ కాలుష్యం పెరుగుతుందని.. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ను తీసేసి రాజధాని కడదామని జగన్ ఒక సందర్భంలో చెప్పారు. జగన్ ఏమంటున్నారో తనకు కాసేపు అర్థం కాలేదు. స్టీల్ ప్లాంట్ కారణంగా కాలుష్యం ఉండదని.. ఒకవేళ అలాంటిదేమైనా ఉందన్న సందేహాన్ని తీర్చుకునేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో అధ్యయనం చేయిద్దామని చెప్పా. దానికి స్పందించిన జగన్.. నీకేం తెలియదన్నా ఊరుకో.. ప్రతిదానికీ కేంద్రం అంటావ్ అంటూ చిన్నగా విసుక్కున్నారు. తాను చెప్పిన కొన్ని విషయాలకు సంబంధించి మంచి చెడుల గురించి చర్చించేందుకు ఆయన ఇష్టపడరు’’ అంటూ పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్తల్లో జగన్.. ప్రజావేదికను కూల్చేసిన వైనం తెలిసిందే. అక్రమనిర్మాణంగా పేర్కొంటూ దాన్ని కూల్చేశారు. అయితే.. దీనికి సంబంధించిన నిర్ణయం జగన్ చాలా నాటకీయంగా తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఎల్వీ చెబుతూ.. ‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాలన్నారు. కాన్ఫరెన్స్ కు రెండు రోజుల ముందు వరకు కూడా ఎక్కడ దాన్ని నిర్వహించాలన్న దానిపై సీఎం నుంచి సమాచారం రాలేదు. వేదిక ఖరారు కానిదే.. ఏర్పాట్లు చేయలేని పరిస్థితి. ఇలాంటి వేళలో.. సీఎంవో నుంచి ధనుంజయ్ రెడ్డిఫోన్ చేశారు. ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహణకు ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్లు చెప్పారు. అదే టైంలో ప్రజావేదికను కూల్చేస్తామని కూడా అప్పుడే చెప్పారు. దీంతో.. విస్మయానికి గురయ్యాను. అయితే.. ప్రజావేదికను కూల్చేసే అంశాన్ని రహస్యంగా ఉంచాలన్నారు. కూల్చివేత గురించి ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారని తెలిసి షాక్ తిన్నా. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలు ఎలా ఉంటాయన్న దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం’’ అంటూ ఎల్వీ వెల్లడించారు.