Begin typing your search above and press return to search.

మాచర్ల నియోజకవర్గం సినిమా టైటిల్ కాదు.. అంతకు మించి...

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకోవడంతో కేసు మళ్లీ రీ ఓపెన్ అయింది.

By:  Tupaki Desk   |   11 March 2025 5:57 PM IST
మాచర్ల నియోజకవర్గం సినిమా టైటిల్ కాదు.. అంతకు మించి...
X

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. గత ప్రభుత్వంలో చెలరేగిపోయిన దుండగుల ఆట కట్టించేందుకు ప్రత్యేక ఆపరేషన్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. ఫ్యాక్షన్ కు నిలయమైన మాచర్లలో ప్రస్తుతం టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అయితే గత 20 ఏళ్లుగా మాచర్లను అడ్డాగా చేసుకుని వైసీపీ నేత పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి, ఆయన సోదరుడు అరాచకంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తోంది. వారి అరాచకానికి పరాకాష్టగా టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్యను పరిగణిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకోవడంతో కేసు మళ్లీ రీ ఓపెన్ అయింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాచర్ల పేరు చెప్పాలంటే టీడీపీ క్యాడర్ వణికిపోయేవారు. ఇళ్లు, ఊళ్లు వదిలిపెట్టి బయట ప్రాంతాల్లో తలదాచుకోవాల్సివచ్చింది. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం అంటే 2022 జనవరి 13న వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యను పట్టపగలే నరికి చంపేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో ఆ ఘోరకలిని అంతా ఖండించారు. అయితే ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉండటం, నిందితులకు ఆ పార్టీ మద్దతు ఉందనే ప్రచారంతో కేసు తీవ్రత లేకుండా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడుగురు నిందితులను అరెస్టు చేసినా, వారికి వెంటనే బెయిల్ రావడం, నిందితులు మళ్లీ గ్రామంలో బెదిరింపులకు దిగడంతో టీడీపీ కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లిపోవాల్సివచ్చింది.

ఇక కార్యకర్త చంద్రయ్య హత్యతో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు చలించిపోయారు. స్వయంగా మాచర్లలోని గుండ్లపాడు వెళ్లి చంద్రయ్య అంతిమయాత్రలో కాడి మోశారు. పీకపై కత్తి పెట్టినా చంద్రయ్య జై చంద్రబాబు.. జై తెలుగుదేశం అనడం టీడీపీ క్యాడర్ ను కదిలించింది. అధికారంలోకి వచ్చాక చంద్రయ్య హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారుల ఆట కట్టిస్తానని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు చంద్రయ్య కేసును పునర్విచారించాలని టీడీపీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. దీంతో తొమ్మిది నెలల తర్వాత సీఎం చంద్రబాబు ప్రభుత్వం కీలక అడుగు వేసింది చంద్రయ్య కేసును పునర్విచారించాలని నిర్ణయించింది. అంతేకాకుండా కేసును సీఐడీకి అప్పగించింది.

ప్రభుత్వ నిర్ణయం వైసీపీని టెన్షన్ పెడుతోంది. చంద్రయ్య హత్య కేసులో వెల్దుర్తి మండలాధ్యక్షుడుతోపాటు ఆయన సమీప బంధువులపై ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు. కేసు పునర్విచారణ అంటే నిందితులను మళ్లీ అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా మాచర్లలో ఫ్యాక్షన్ రేపిన పిన్నెళ్లి బ్రదర్స్ కి కష్టాలు తప్పవని అంటున్నారు. ఇప్పటికే ఓ సారి అరెస్టు అయి బెయిల్ వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి పరిస్థితి ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి మాచర్ల నియోజకవర్గం రాజకీయం ఫ్యాక్షన్ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను తలపిస్తోంది.