Begin typing your search above and press return to search.

వైసీపీకి షాకుల మీద షాకులు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన టీడీపీ తన దూకుడు కొనసాగిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 6:28 AM GMT
వైసీపీకి షాకుల మీద షాకులు!
X

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన టీడీపీ తన దూకుడు కొనసాగిస్తోంది. ఆయా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలనున చేజిక్కుంచుకునే దిశగా దూసుకెళ్తోంది. గతంలో జరిగిన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క తాడిపత్రిని మినహాయించి అన్నింటిని వైసీపీ గెలుచుకుంది. ఒక్క తాడిపత్రిని మాత్రమే టీడీపీ గెలుచుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నాడు అధికార వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనీయలేదు. దీంతో చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవంగా కాగా కొన్ని చోట్ల నామమాత్రంగా ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఒక్క తాడిపత్రిని మినహాయించి అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో నాడు విజయకేతనం ఎగురవేసింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండటంతో ఆయా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో భారీ ఎత్తున కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే చిత్తూరు, ఒంగోలు, విశాఖపట్నం, నెల్లూరు నగరాల్లో చాలామంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత సైతం టీడీపీలో చేరిపోయారు.

తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరనుంది. ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ మాచర్ల చిన్న ఏసోబు, వైస్‌ ఛైర్మన్‌ నరసింహారావు సైతం టీడీపీలో చేరనున్నారు. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులున్నాయి. 2022లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను వైసీపీ నేతలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండటంతో కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే 14 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లు పార్టీలో చేరారు. మున్సిపల్‌ చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ కూడా చేరితే 16 మంది చేరినట్టు అవుతుంది. దీంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ చేతికి వస్తుంది.

ఇక ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. హిందూపురం మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ ఇంద్రజతోపాటు 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది వార్డులున్నాయి. ఇందులో 30 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో చైర్‌ పర్సన్‌ ఇంద్రజతో కలిపి మొత్తం 10 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వీరికి నందమూరి బాలకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరే కాకుండా మరికొందరు కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం హిందూపురంలో టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీకి, ఎంఐఎంకు ఒకరు చొప్పున కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో చేరినవారితో కలిపి ఆ పార్టీకి మొత్తం 16 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీ సభ్యుడు కూడా టీడీపీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. దీంతో కూటమి బలం 17కు చేరింది. దీంతో హిందూపురం మున్సిపాలిటీ సైతం టీడీపీ చేతికి వస్తోంది.