నంబర్ ప్లేట్ లేకుండా వాహనాల రయ్.. మాచర్ల స్పెషల్ ఇదే
ఎందుకిలా? నంబరు ప్లేట్ లేని వాహనాల్లో అంత హడావుడిగా తిరగటం వెనుక అసలు కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఉలిక్కిపడాల్సిందే.
By: Tupaki Desk | 29 Jan 2024 7:30 AM GMTసిత్రం కాకుండా రోడ్ల మీద బండ్లు కాకుండా మరేం తిరుగుతాయన్న ఎటకారం అక్కర్లేదు. కానీ.. ఆ వాహనాలకు ఉండాల్సిన నంబర్ ప్లేట్లు మాత్రం ఉండవు. అది ఒక్కటో రెండో కాదు.. పదుల సంఖ్యలో నంబరు ప్లేట్లు లేకుండా రోడ్ల మీదకు దూసుకెళ్లే విచిత్రమైన కల్చర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది మాచర్ల నియోజకవర్గం. అలా అని తిరిగే వాహనాలన్ని బ్రాండ్ న్యూ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అవన్నీ పాత వాహనాలే. కానీ.. వేటికీ ఎలాంటి నంబర్లు ఉండవు. అడిగే నాథుడు ఉండడు. ఎందుకంటే.. అవన్నీ కొందరివి కావటమే దీనికి కారణంగా చెబుతున్నాడు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం ఒకటి. కొత్తగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లాల్లో భాగమైన మాచర్ల నియోజకవర్గం రూటు కాస్తంత సపరేటు. రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో పని చేసే రూల్స్ ఇక్కడ వర్కువుట్ కావు. మాచర్ల కంటూ స్పెషల్ రూల్స్ ఫాలో అవుతుంటారు కొందరు. నియోజకవర్గ సరిహద్దుల్లో తెలంగాణ రాష్ట్రం ఉండటం.. అటు ఇటు ఎంచక్కా ఇష్టారాజ్యంగా తిరిగే ఈ వాహనాలకున్న మరో ఇస్పెషల్ ఏమంటే.. కొన్ని వాహనాలు అయితే ఏకంగా పోలీస్ సైరన్ వేసుకుంటూ మాచర్ల పట్టణంలో రయ్ రయ్ మని తిరుగుతుంటాయి. మరి.. అక్కడ పోలీసులు ఉండరా? అంటే.. ఉంటారు. వారి పని వారిది. వీరి పని వీరిది అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
ఎందుకిలా? నంబరు ప్లేట్ లేని వాహనాల్లో అంత హడావుడిగా తిరగటం వెనుక అసలు కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఉలిక్కిపడాల్సిందే. ఎందుకంటే.. రాజకీయంగా కొన్ని పలుకుబడి కుటుంబాలకు చెందిన వారి వాహనాలకే ఈ స్పెషాలిటీ. ఇంతకూ నంబరు ప్లేట్లు లేకుండా రోడ్ల మీద తిరిగే ఈ వాహనాల్లో మద్యం.. మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతుందని చెబుతుంటారు. నియోజకవర్గంలోని కారంపూడి.. దర్శి.. మాచర్ల పట్టణాల్లోని ప్రధాన వీధుల్లో సైరన్ వేసుకుంటూ తిరుగుతున్నా అడ్డుకునే వారే ఉండరని చెబుతున్నారు.
నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో వేలం వేసి బెల్టు దుకాణాలకు అనుమతి ఇచ్చిన నేతలు ఆయా దుకాణాలకు తెలంగాణ మద్యంతో పాటు ఏపీ మద్యాన్ని ఈ వాహనాల్లోనే సరఫరా చేస్తారని చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి మండలానికి రెండు వాహనాలు కేటాయించారు. ఒక్కో వాహనం తెలంగా నుంచి కనిష్ఠంగా రూ.5 లక్షలు.. గరిష్ఠంగా రూ.10 లక్షల విలువైన సరుకును తీసుకొస్తారని చెబుతున్నారు. నియోజకవర్గ సరిహద్దుల్లోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు 80 మద్యం దుకాణదారులతో చేసుకున్న ప్రత్యేక ఒప్పందంలో భాగంగా నంబరు ప్లేట్లు లేని ప్రత్యేక కార్లల్లో సరఫరా చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. పనిలో పనిగా కొందరు గుట్కా.. గంజాయిలాంటి మత్తు పదార్థాల రవాణాకు ఈ వాహనాల్ని వాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ విష సంస్క్రతికి చెక్ పెట్టకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయన్న మాట వినిపిస్తోంది.