హోంవర్క్ కోసం మెషిన్... సంచలనంగా ఏఐ వాడకం వీడియో!
ఈ సమయంలో... ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఓ విద్యార్థి హోంవర్క్ రాసే యంత్రాన్ని కనిపెట్టాడు.
By: Tupaki Desk | 24 Nov 2024 4:36 AM GMTరోజు రోజుకీ టెక్నాలజీ ఏస్థాయిలో అభివృద్ధి చెందుతుందనేది తెలిసిన విషయమే. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తెరపైకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచం ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఓ విద్యార్థి హోంవర్క్ రాసే యంత్రాన్ని కనిపెట్టాడు.
అవును... ఏఐ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాని ఒకరంటే.. ఎన్నో ప్రమాదాలు కూడా ఉన్నాయని మరొకరు అంటున్నారు. ఈ రెండు అభిప్రాయాలను బలపరిచే ఘటనలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి! అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది ఉపయోగమా, నష్టమా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. తన హోంవర్క్ చేయడానికి ఓ విద్యార్థి ఒక యంత్రాన్ని కనిపెట్టాడు.
ఒకప్పుడు రికార్డ్స్ రాయడానికి ఇంట్లో అన్న సాయమో, అక్క సహాయమో, ఫ్రెండ్స్ హెల్పో తీసుకునేవారని అంటారు. అయితే అలా ఎవరూ వద్దు.. ఏఐ సహాయం తీసుకుంటే పర్మినెంట్ సోల్యూషన్ అని భావించాడో ఏమో కానీ.. అచ్చు తన దస్తూరిలా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నాడు ఓ విద్యార్థి.
చివరికి.. పేజీ పూర్తైన తర్వాత పేపర్ తిప్పే పని కూడా పెట్టుకోనవసరం లేకుండా ప్లాన్ చేశాడు. ఇలా విద్యార్థి చేతిరాతతో పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతూ హోం వర్క్ చేస్తున్న ఈ మెషిన్ కి సంబంధించిన వీడియో గతంలోనే వెలుగులోకి వచ్చినా... ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. మిలియన్స్ వ్యూస్ తో దూకుసుపోతోంది!
ఈ వీడియోలో... మెషిన్ సదరు విద్యార్థి చేతిరాతను అసైన్మెంట్ చేయడానికి ముందుగా చేతిరాతను స్కాన్ చేస్తుంది. ఈ సమయంలో ఆ సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకున్న ఏఐ... దానిని కాగితంపై రాసేస్తుంది. అది పూర్తి చేసిన హోంవర్క్ చూసినవారు.. విద్యార్థే స్వయంగా రాసినట్లు భావిస్తారు!
దీంతో... విద్యార్థులు ఇలా హోంవర్క్ కోసం ఏఐపై ఆధారపడటం వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యల గురించి ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమయాన్ని ఆదా చేయడానికి ఇలాంటి తాత్కాలిక పరిష్కారాలు చూసుకున్నప్పటికీ.. ఇది చేతివ్రాత నైపుణ్యాల క్షీణతకు దారి తీస్తుందని అంటున్నారు.