యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంటే !
"ఈ ఘటన యాక్సిడెంటల్ కాదు. ఇది ఖచ్చితంగా ఇన్సిడెంటే. ఈ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగేందుకు ఎలాంటి అవకాశాలు లేవు.
By: Tupaki Desk | 23 July 2024 4:00 AM GMTఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వయంగా ఆయన మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి విచారణ నిర్వహించారు.
"ఈ ఘటన యాక్సిడెంటల్ కాదు. ఇది ఖచ్చితంగా ఇన్సిడెంటే. ఈ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగేందుకు ఎలాంటి అవకాశాలు లేవు. ఇక్కడ విద్యుత్ హెచ్చుతగ్గులకు అవకాశం లేదు. ఆర్డీఓ కార్యాలయం కిటికీ పక్కన అగ్గిపుల్లలు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసు, రెవెన్యూ వైఫల్యం కనిపిస్తుంది. ఆదివారం రాత్రి 11.30 గంటలకు ప్రమాదం జరిగినా ఆర్డీఓ కలెక్టర్ కు కానీ, పోలీసు అధికారులకు కానీ సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తుందని" డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.
ఆర్డీఓ కార్యాలయంలో 22ఏ భూముల రికార్డులు ఉన్న గదిలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్దంఅయ్యాయి. ఈ 25 అంశాలలో చుక్కల భూములు, నిషేధిత భూములు ఉన్నాయి. ఈ కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు రెవెన్యూ శాఖ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఫైళ్లలో మిస్సయిన అంశాలు ఏంటో తేలితే దానికి సంబంధించిన దోషులు ఎవరు అన్నది బయటకు వస్తుందని అంటున్నారు.