Begin typing your search above and press return to search.

షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారా? ఆవిడ మాట విన్నారా?

ఇవాల్టి రోజున అవగాహన ఉన్నా లేకున్నా.. ఎవరికుండే లెక్కలతో వారు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:30 PM GMT
షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారా? ఆవిడ మాట విన్నారా?
X

ఇవాల్టి రోజున అవగాహన ఉన్నా లేకున్నా.. ఎవరికుండే లెక్కలతో వారు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాకు ముందు కరోనా తర్వాత ట్రేడింగ్ మీద ఫోకస్ చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇలాంటి వారికి మార్కెట్ మీదా.. ట్రేడింగ్ మీద ఉన్న అవగాహన ఎంతన్న విషయానికి వస్తే.. పెద్ద క్వశ్చన్ మార్కు ఖాయం. ఇటీవల కాలంలో ట్రేడిండ్ లో ఎంట్రీ ఇచ్చి.. చేతులుకాల్చుకుంటున్న ఎంతోమంది నోటి నుంచి వినిపించే మాట.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. తక్కువ వ్యవధిలో భారీగా సంపాదించాలంటే దీనికి మించిన మార్గం మరొకటి ఉండదని చెబుతుంటారు.

అయితే.. ఇందులో పోగొట్టుకుంటున్నంత భారీగా మరి దేంట్లోనూ పోగొట్టుకోరన్న మాట నిపుణుల నోట వినిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఫ్యూచర్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. అయితే.. ఫ్యూచర్స్ మీద పెట్టుబడులు పెట్టే వారందరికి భారీ హెచ్చరికతో పాటు.. కీలకమైన సూచనలు చేశారు సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి బచ్.

తాజాగా ఆమె చెప్పిన మాటలు విన్నప్పుడు.. ట్రేడింగ్ చేసే వారిలో అత్యధికులు చేసే తప్పుల్ని ఆమె ఎత్తి చూపారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మదుపర్ల ఆసక్తి తనకెంతో ఆశ్చర్యాన్ని.. గందరగోళానికి గురి చేస్తుందన్నారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారిలో 90 శాతం మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో పెట్టుబడులు పెట్టి డబ్బులు కోల్పోతుంటారని పేర్కొన్నారు.

దీర్ఘకాలిక సాధనాల్లోనే మదుపరులు పెట్టుబడులు పెట్టాలన్న సూచన చేసిన ఆమె.. బీఎస్ ఈలో ''ఇన్వెస్టర్ రిస్క్ రెడెక్షన్ యాక్సెస్'' ప్లాట్ ఫామ్ ను ప్రారంభించే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు.. చెప్పిన సూచనల్ని చూస్తే.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి ఒక మార్గదర్శనం చేసినట్లుగా ఉంటుందని చెప్పాలి. ఇంతకూ ఆమె ఏం చెప్పారన్నది చూస్తే..

- మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టినప్పుడే మెరుగైన లాభాలు వస్తాయి

- ద్రవ్యోల్బణాన్ని అధిగమించిన రాబడి పొందాలంటే ఇదే మేలైన మార్గం

- ఎఫ్అండ్ఓలో పెట్టుబడులు పెట్టిన 45.24 లక్షల వ్యక్తిగత ట్రేడర్లలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు పొందారు

- 2018-19ఆర్థిక సంవత్సరం తర్వాత ఈ సెగ్మెంట్ లో మదుపు చేస్తున్న వారి సంఖ్య 500 శాతం పెరిగింది

- 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్అండ్ఓలో పెట్టుబడులు చేసిన వారిలో 89 శాతం మంది నష్టపోయారు. వీరంతా కలిసి దాదాపు రూ.1.1 లక్షల కోట్లు సంపద కోల్పోయారు.

- లాభాలు పొందిన వారిలో సగటున ఒక్కొక్కరు రూ.1.5 లక్షలు ఆర్జించారు

- 2018-19 నాటికి ఎఫ్అండ్ఓలో పెట్టుబడులుపెట్టే వారిలో 11 శాతం మంది 20-30 ఏళ్ల లోపువారే

- బ్రోకింగ్ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తినప్పుడు పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా ఇన్వెస్టర్ రిస్క్ రెడెక్షన్ యాక్సెస్ (ఐఆర్ఆర్ఎ) విధానాన్ని తీసుకొచ్చాం.