కేసీఆర్‌కు కొరుకుడు పడని మదన్‌రెడ్డి.. నర్సాపూర్‌లో నిండా మునకే!
ఈ నేపథ్యంలో మదన్‌రెడ్డి మద్దతుదారులు పలు రకాలుగా నిరసన తెలుపుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ మదన్‌రెడ్డితో మాట్లాడినా ఆయన దారికి రాలేదు.
By: Tupaki Desk | 19 Oct 2023 8:47 AM GMTరాజకీయాలంటే రాజకీయాలే. ఒక్కొక్కసారి ఎంత సీరియస్‌గా చక్రం తిప్పినా.. ఫలించడం కష్టమే. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఎదురైంది. సొంత పార్టీ నాయకుడు, సీనియర్ నేతను తప్పించాలని ఆయన వ్యూహం. ఎన్నికల్లో ఆయన స్థానంలో వేరేవారికి టికెట్ ఇచ్చి.. ఆయన సాయంతోనే గెలుపు గుర్రం ఎక్కాలనేది ప్లాన్. కానీ, ఇది బెడిసి కొట్టనుంది. ఎందుకంటే.. తనకు టికెట్ రాకపోతే.. కేసీఆర్ ఫొటో పెట్టుకుని.. స్వతంత్ర అభ్యర్థిగా అయినా.. ప్రజల్లోకి వెళ్తానని.. సదరు నాయకుడు ప్రకటనలు చేయడమే.
ఈ చిత్రమైన వ్యవహారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి 2018లో బీఆర్ ఎస్ తరఫున చిలుముల మదన్‌రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ దఫా ఆయనను పక్కన పెట్టి.. కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న.. ప్రస్తుత మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో మదన్‌రెడ్డి తన వ్యూహం తాను రెడీ చేసుకున్నారు.
కేసీఆర్ టికెట్ ఇస్తే.. సరే. లేకపోతే.. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతా అని మదన్ రెడ్డి ప్రకటించారు. అక్కడితో ఆయన ఆగలేదు. తాను ప్రజల్లోకి కేసీఆర్ ఫొటో పట్టుకునే వెళ్తానని.. తనకు టికెట్ ఇవ్వలేదన్న విషయాన్ని కూడా వారికి వివరిస్తానని మదన్‌రెడ్డి చెబుతున్నారు. జిల్లాలో మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ఇందులో నర్సాపూర్ నియోజకవర్గం ఒకటి.
ఇక, మదన్‌రెడ్డి పరిస్థితి ఏంటంటే..
మదన్‌రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీఆర్ ఎస్ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. ఆయనపై ఎలాంటి ఆరోపణలు కూడా లేవు. ప్రస్తుత ఎన్నికల్లో మూడోసారి పోటీచేసి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో కూడా ఉన్నారు. అయితే.. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ ఎస్‌లో చేరే సమయంలో సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. ఇప్పుడు ఆమెకు టికెట్ కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మదన్‌రెడ్డి మద్దతుదారులు పలు రకాలుగా నిరసన తెలుపుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ మదన్‌రెడ్డితో మాట్లాడినా ఆయన దారికి రాలేదు. కొన్ని రోజులుగా మదన్‌రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అనుచరులు మాత్రం ఆయన వద్దకు నిత్యం వెళుతూ.. పోటీలో ఉండాలని కోరుతున్నారు.
ఏం జరుగుతుంది?
మదన్ రెడ్డికి స్థానికంగా సింపతీ ఉంది. అవినీతి రహితంగా ఆయన ముద్ర వేసుకున్నారు. అంతేకాదు.. పిలిస్తే పలికే నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ కనుక ఆయనకు టికెట్ ఇవ్వకపోతే.. స్వతంత్రంగా బరిలో దిగి.. ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి.