Begin typing your search above and press return to search.

ఆ మహిళా ఎమ్మెల్యేకు చంద్రబాబు సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jun 2024 7:33 AM GMT
ఆ మహిళా ఎమ్మెల్యేకు చంద్రబాబు సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ కేవలం 11 స్థానాలకే పతనమైంది. కాగా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. జూన్‌ 12న ఆయన గన్నవరం సమీపంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రులుగా ఎవరికి చాన్సు దక్కుతుందనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ తరఫున మొత్తం 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. జనసేన తరఫున 21 మంది, బీజేపీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మిత్రపక్షాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండటంతో చంద్రబాబుకు మంత్రివర్గ విస్తరణ కత్తిమీద సామేనని అంటున్నారు. మొత్తం 25 మందిని మాత్రమే మంత్రులుగా నియమించుకోవడానికి అవకాశం ఉంది. అయితే కూటమి తరఫునే 164 మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.

కాగా కొందరికి చంద్రబాబు సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ దశాబ్దాల కాలంగా గెలుపు సాధించని నియోజకవర్గాల నుంచి గెలిచినవారికి మంత్రివర్గంలో చాన్సు ఇస్తారని అంటున్నారు. ఈ క్రమంలో కడప నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్పగారి మాధవికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఆమె ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి 18,860 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి అంజాద్‌ బాషాను ఓడించారు. అంజాద్‌ భాషా.. జగన్‌ మంత్రివర్గంలో ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.

చివరిసారిగా కడపలో 1999లో టీడీపీ గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పటివరకు విజయం సాధించలేకపోయింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో కడప టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్పగారి మాధవిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని చర్చ నడుస్తోంది.

రెడ్డి సామాజికవర్గ కోణంలోనూ, మహిళల కోటాలోనూ మాధవికి మంత్రిపదవి ఖాయమని చెబుతున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన ఆమె భర్త శ్రీనివాస్‌ రెడ్డి చాలా కాలంగా టీడీపీకి ఆర్థిక సాయం చేస్తున్నారు.

నిన్న మొన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌ సొంత జిల్లాలో, అది కూడా జిల్లా కేంద్రంలో వైసీపీని మట్టికరిపించడంతో మాధవికి ప్రాధాన్యం పెరిగిపోయిందని అంటున్నారు. దీంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.

కడపలో వైసీపీని ఢీకొట్టాలన్నా, టీడీపీని బలోపేతం చేయాలన్నా ఆ జిల్లాకు మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా మాధవి ఉన్నత విద్యావంతురాలని, మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె సరిగ్గా సెట్‌ అవుతారని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.