నేటి భారతం... ఓటు కావాలంటే గన్ లైసెన్స్ ఇప్పించాలి!
ప్రీ ఫైనల్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి
By: Tupaki Desk | 27 Oct 2023 4:24 AM GMTప్రీ ఫైనల్ గా భావిస్తున్న ఐదురాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టోల విడుదల, బహిరంగ సభల సందడితో.. ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఇదే సమయంలో ప్రజలను హామీలతో ముంచేస్తున్నాయి పార్టీలు. ఈ సమయంలో ప్రజల నుంచి కూడా డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక డిఫరెంట్ డిమాండ్ తెరపైకి వచ్చింది.
సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే అన్ని రాజకీయ పార్టీలూ ఓటర్లకు అరచేతిలో స్వర్గం చూపించేస్తుంటాయి! ఓటు వేసి గెలిపించడమే ఆలస్యం... ఇక మీజీవితాలు పూర్తిగా మారిపోతాయని, లైఫ్ పూర్తిగా యూటర్న్ వేసేస్తాదని, కష్టాలు ఉండవని, కన్నీళ్లకు తావుండదని చెబుతుంటాయి. ఇది నమ్మి ఓటు వేసిన ఓటరుకు సదరు నాయకుడు తర్వాత నల్లపూస అయిపోతాడు.. వెలుగులో కూడా కనిపించకుండా తిరుగుతుంటాడు!!
ఇది చాలా మందికి ఉన్న అనుభవం! స్వాతంత్రం వచ్చినప్పటినుంచీ ప్రతీ రాజకీయ నాయకుడూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఉంటే... సక్రమంగా పనిచేసి ఉంటే.. అవినీతి రహిత పాలన అందించి ఉంటే.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు భారత్ అప్పు ఇచ్చేదని చెబుతుంటారు! ఆ సంగతుల సంగతి అటుంచితే... తుపాకులకు లైసెన్స్ ఇస్తేనే ఓటూ వేస్తామని అడుగుతున్నారు ఎంపీ ప్రజలు.
సాధారణంగా ఎన్నికల్లో నాయకులను ప్రజలు కొన్ని కొన్ని ప్రామిస్ లు అడుగుతారు. రోడ్డు కావాలని, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలని, మంచి నీటి ఎద్దడి సమస్య తీర్చాలని, సాగు నీరు కావాలని కోరుతుంటారు. అయితే... ఇందుకు పూర్తి భిన్నంగా... తుపాకీ లైసెన్సులు కావాలని కోరుతున్నారు మధ్యప్రదేశ్ లోని ఓటర్లు.
అవును... మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు ఓటర్ల నుంచి సరికొత్త డిమాండ్లు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య ఎక్కువగా ఉందని.. దీన్ని నిర్మూలించడానికి తమకు తుపాకీ లైసెన్సులు కావాలని కోరుతున్నారు భిండ్ నియోజకవర్గ ఓటర్లు. తుపాకీ లైసెన్సు ఉంటే.. దేశంలో ఎక్కడికైనా వెళ్లి సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు చేసుకోవచ్చన్నది వారి ఉద్దేశం అన్నమాట!
దీంతో ఈ రిక్వస్ట్ కం డిమాండ్ ఆసక్తిగా మారింది. దీంతో విపక్షాలు నోటిపని చెబుతున్నాయి. ఇందులో భాగంగా... మధ్యప్రదేశ్ లోని నిరుద్యోగ సమస్యకు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపలేదని.. అందువల్ల ఓటర్ల తుపాకీ లైసెన్సు డిమాండు న్యాయమైనదేనని.. భిండ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ సింగ్ చతుర్వేది అంటున్నారు.
మరోపక్క.. మళ్లీ అధికారంలోకి రాగానే ప్రభుత్వంతో మాట్లాడి ఓటర్ల డిమాండు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు బీజేపీ అభ్యర్థి నరేంద్రసింగ్ కుశ్వాహా! ప్రస్తుతానికి బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో పరిస్థితి అలా ఉంది!