ఆలయంలోకి వితంతు మహిళలు... హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు!
అవును... వితంతువులను దేవాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడం వంటివి ఈ నాగరిక సమాజంలో జరగవని మద్రాస్ హైకోర్టు పేర్కొంది
By: Tupaki Desk | 5 Aug 2023 1:29 PM GMTభారతదేశంలో ఒకవైపు చంద్రుడిమీదకు శాటిలైట్స్ పంపిస్తుంటుంటే.. మరోవైపు అనాగరిక పోకడలు పెచ్చుమీరుతుంటుంటాయి! ఇప్పటికీ దేశంలో మూడనమ్మకాలు అక్కడక్కడా రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికీ కులమతాల రచ్చలు నిత్యం దర్శనమిస్తుంటాయి. ఈ సమయంలో మూడనమ్మకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... వితంతువులను దేవాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడం వంటివి ఈ నాగరిక సమాజంలో జరగవని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. స్త్రీకి తనకంటూ ఒక గుర్తింపు ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికీ ఒక వితంతు స్త్రీ ఆలయంలోకి ప్రవేశించకూడనే ప్రాచీన విశ్వాసాలు రాష్ట్రంలో ప్రబలంగా ఉండటం చాలా దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
వివరాల్లోకి వెళ్తే... ఈరోడ్ జిల్లాలోని నంబియూర్ తాలూకాలో ఉన్న పెరియకరుపరాయణ్ దేవాలయంలోకి ప్రవేశించడానికి తనకు, తన కుమారుడికి రక్షణ కల్పించాలని తంగమణి అనే మహిళ పోలీసులను కోరింది. ఈ సందర్భంగా దాఖలైన పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం విడుదల చేసిన తన ఉత్తర్వుల్లో ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వితంతువు ఆలయంలోకి ప్రవేశిస్తే అపవిత్రత వస్తుందన్న ప్రాచీన విశ్వాసం రాష్ట్రంలో నెలకొనడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తన భర్తను కోల్పోయిన కారణంగా స్త్రీని అవమానించడం చాలా తప్పని కోర్టు పేర్కొంది.
ఇదే క్రమంలో న్యాయవ్యవస్థ పాలనలో ఉన్న నాగరిక సమాజంలో ఇవన్నీ ఎప్పటికీ కొనసాగవని జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ప్రకటించారు. పండుగలో పాల్గొనకుండా, ఆలయాల్లో ప్రవేశించకుండా మహిళను ఎవరూ ఆపలేరని మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తంగమణిని బెదిరిస్తున్న వారిని పిలిపించి మాట్లాడాలని.. ఆమె కుమారుడిని, ఆమెను ఆలయంలోకి రాకుండా, ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకోలేమని స్పష్టంగా తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆగస్టు 9, 10 తేదీల్లో జరిగే ఉత్సవాల్లో పిటిషనర్ తోపాటు అతని కుమారుడు కూడా పాల్గొనేలా పోలీసులు చూడాలని ఆదేశించింది.
కాగా... ఇదే ఆలయంలో పూజారిగా ఉన్న తన భర్త ఆగస్టు 28, 2017న మరణించాడని.. దీంతో తనను ఆలయంలో నిర్వహించే ఆడి ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని.. తాను వితంతువు కాబట్టి గుడిలోకి వెళ్లకూడదని చెప్పారని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇలా వ్యాఖ్యానించింది.