తండ్రికి కూడా ప్రసూతి సెలవులు... జస్టిస్ విక్టోరియా గౌరి !
తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందా
By: Tupaki Desk | 23 Aug 2023 7:58 AM GMTతల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందా.. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వక తప్పదా.. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాల్సిన సమయం ఆసన్నమైందా అంటే... అవుననే అంటోంది మదురై ధర్మాసనం!
అవును... ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావకపోవడం అనాగరికమే అనే స్థాయిలో తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులో ఇన్ స్పె క్టర్ గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. తన భార్య ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చిందని.. ఫలితంగా కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరాడు. దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న అధికారులు లీవ్ శాంక్షన్ చేశారు.
అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు అధికారులు. దీంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. ఫలితంగా... డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మని సూచించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు అతనికి 30 రోజులు సెలవు మంజూరు చేశారు.
అంతా సజావుగానే అయిపోయిందనుకున్న సమయంలో... మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును అధికారులను కోరాడు. దీంతో... అధికారులు సెలవును పొడిగించకపోగా వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. దీంతో ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. దీంతో అధికారులు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన కోర్టు... మగవారికి కూడా ప్రసూతి సెలవులు అవసరమని అభిప్రాయపడింది.
అవును... తాజాగా మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అని చెప్పిన ఆమె... "పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది" అని తెలిపారు. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉన్నప్పటికీ ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదని ఆమె తెలిపారు!