Begin typing your search above and press return to search.

మాడుగుల మోత : వైసీపీ టీడీపీకి రెబెల్స్ బెడద !

అనకాపల్లి జిల్లా మాడుగులలో వైసీపీ టీడీపీలకు రెబెల్స్ బెడద తప్పేట్లు లేదు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2024 3:48 AM GMT
మాడుగుల మోత : వైసీపీ టీడీపీకి రెబెల్స్ బెడద !
X

అనకాపల్లి జిల్లా మాడుగులలో వైసీపీ టీడీపీలకు రెబెల్స్ బెడద తప్పేట్లు లేదు అని అంటున్నారు. రెండు సార్లు ఇక్కడ వరసగా గెలిచి సత్తా చాటిన వైసీపీ ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం చూస్తోంది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దాంతో మాడుగులలో ఆయన కుమార్తె ఈర్లె అనూరాధకు టికెట్ ని పార్టీ ఇచ్చింది.

అయితే ఇపుడు బూడి కుటుంబంలోనే చిచ్చు రేగింది. బూడి కుమారుడు రవి రెబెల్ గా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఆయన తాజాగా మాడుగుల అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన తండ్రి వదిలేసిన మాడుగుల సీటు తనకే ఇవ్వాలని పట్టు పడుతున్నారు. తాను గతంలో కూడా ఒకసారి త్యాగం చేశాను అని గుర్తు చేస్తున్నారు.

స్థానిక ఎన్నికల సందర్భంగా కె కోటపాడు జెడ్పీటీసీకి తాను పోటీ చేస్తానని చెప్పినా ఈర్లె అనూరాధ కోసం తనను ఒప్పించి పక్కన పెట్టారని అంటున్నారు. ఇపుడు చూస్తే ఏకంగా ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమెకే ఇచ్చారని ఆయన మండిపోతున్నారు. అందుకే తాను పోటీ అంటున్నారు. దీని కంటే ముందు ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ పార్టీ దగ్గరకు తీయలేదు. ఇవన్నీ పక్కన పెడితే బూడికి ఈ విధంగా సన్ స్ట్రోక్ తగిలింది అని అంటున్నారు.

మాడుగులలో మంచి మెజారిటీ వస్తే అది ఎంపీ ఎన్నికల్లో బూడికి కలసి వస్తుందని భావిస్తున్నారు. అయితే చూడబోతే మాడుగులలో అన్నా చెల్లెళ్ళ మధ్య పోటీ సాగేలా కనిపిస్తోంది. ఈ నెల 29వ తేదీలోగా రవి నామినేషన్ ని విరమించేలా చూస్తేనే వైసీపీకి రిలీఫ్ అని అంటున్నారు.

ఇక తెలుగుదేశం పరిస్థితి ఇంతకంటే ఇబ్బందికరంగా ఉంది. ఆ పార్టీ నుంచి పలువురు పోటీకి తయారుగా ఉండగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని తెచ్చి చివరాఖరికి పోటీకి పెట్టారు. దాంతో మొదటి జాబితాలో తన పేరు ఉందని అప్పటి నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్న ఎన్నారై పైలా ప్రసాదరావు నామినేషన్ తొలి రోజునే వేసేశారు. ఆయన పోటీకి సిద్ధం అంటున్నారు.

అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కూడా నామినేషన్ దాఖలు చేశారు అని తెలుస్తోంది. ఆయన బలమైన నాయకుడు. గత మూడు సార్లూ ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చింది. ఒకసారి గెలిచి రెండు సార్లు ఓడారు. ఈసారి ఆయన్ని పక్కన పెట్టారు. మరి గవిరెడ్డి చివరి నిముషంలో డ్రాప్ అవుతారా లేదా అన్నది చూడాలి. మొత్తానికి చూస్తే వైసీపీ టీడీపీలను రెబెల్స్ దడ పుట్టించేలా ఉన్నారని అంటున్నారు.