Begin typing your search above and press return to search.

మాడుగులలో వైసీపీకి టీడీపీకి బిగ్ ట్రబుల్స్...!

మాడుగుల సీటు వైసీపీకి కచ్చితంగా గెలిచే సీటు అని అంతా అనుకుంటూ వచ్చారు.

By:  Tupaki Desk   |   1 April 2024 4:33 AM GMT
మాడుగులలో వైసీపీకి టీడీపీకి బిగ్ ట్రబుల్స్...!
X

మాడుగుల సీటు వైసీపీకి కచ్చితంగా గెలిచే సీటు అని అంతా అనుకుంటూ వచ్చారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు హ్యాట్రిక్ కొట్టి మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని అనుకున్నారు. కానీ జగన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చేశారు. ఆయనను తెచ్చి అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా చేశారు.

బూడి మాడుగుల సీటులో ఆయన కుమార్తె కె కోటపాడు జెడ్పీటీసీ అయిన ఈర్లె అనూరాధకు టికెట్ ఇచ్చింది వైసీపీ అధినాయకత్వం. తండ్రీ కుమార్తె ఇద్దరికీ న్యాయం జరిగింది అని బూడి అభిమానులతో పాటు వైసీపీ క్యాడర్ అనుకుంది. ఇంకేముంది ఇద్దరూ విజేతలే అని కూడా సంబరాలు చేసుకున్నారు.

కానీ అక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బూడి కుమారుడు రవి ఇపుడు అడ్డం తిరుగుతున్నారు. ఆయన తన తండ్రికి వ్యతిరేకంగా తన చెల్లెలుకు పోటీ వస్తున్నారు ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే బూడి ఫ్యామిలీలో రేగే చిచ్చు వైసీపీ ఓట్లకు చిల్లు పెడుతుంది.

అలా ఎమ్మెల్యే అభ్యర్ధి అనూరాధతో పాటు ఎంపీ అభ్యర్ధి బూడి ఓట్లకు గండి పడి విజయావకాశాల మీద దెబ్బ పడుతుందని అంటున్నారు. బూడి ఎంపీగా గెలవాలి అంటే మాడుగులలో భారీ మెజారిటీ రావాలి. అక్కడే ఓట్లకు కన్నం పడితే ఇక ఎంపీగా విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్నది చర్చగా ఉంది. బూడి కుమారుడికి నచ్చచెప్పి పోటీ నుంచి విరమించేలా చూస్తారా అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తున్న విషయం.

మరో వైపు చూస్తే మాడుగుల టీడీపీలో రచ్చ సాగుతోంది. అక్కడ టీడీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. మూడూ యాక్టివ్ గా ఉన్నాయి. ఇందులో ఎన్నారై వర్గం గా ఉన్న పైలా ప్రసాదరావుకు టికెట్ ఇచ్చారు. దాంతో ఇంచార్జిగా ఉన్న పీవీజీ కుమార్ మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అయితే రగిలిపోతున్నారు.

ఆయనకు టికెట్ ఇవ్వాలని అనుచరులు వీధులోకి వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ అధినాయకత్వం ఇపుడు ఆలోచనలో పడింది అని అంటున్నారు. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

అదే కనుక జరిగితే బండారు మాడుగులకు షిఫ్ట్ అవుతారు అయినా సరే ఈ మూడు వర్గాలు ఒక్కటిగా నిలిచి బండారుకు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకం అయితే కనిపించడం లేదు అంటున్నారు. ఇదిలా ఉంటే బూడి ఫ్యామిలీలో చిచ్చు వైసీపీని ఇబ్బంది పెడుతూంటే టీడీపీలో వర్గ పోరు సైకిల్ జోరుకు బ్రేకులు వేస్తోంది. వీటి నుంచి రెండు పార్టీలు సర్దుకుంటేనే తప్ప జనంలోకి వెళ్లడం కష్టమే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.