మాడుగుల హల్వా ఎవరికి...!?
ఉంటే అమరావతి సచివాలయంలో లేకపోతే తన సొంత నియోజకవర్గంలో అన్నట్లుగానే మంత్రిగా గడిపారు.
By: Tupaki Desk | 27 March 2024 4:31 AM GMTఅనకాపల్లి జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ సీటు ఇపుడు అందరినీ ఆకర్షిస్తోంది. మాడుగులలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది సరికొత్త చర్చగా మారింది. దానికి కారణం మంగళవారం ఉన్నట్టుండి వైసీపీ బలమైన అభ్యర్ధిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాలనాయుడుని అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా మార్చడమే అని అంటున్నారు. 2006లో మొదట కాంగ్రెస్ జెడ్పీటీసీ గా గెలిచి 2014లో 2019లలో వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున విజేతగా నిలిచారు బూడి ముత్యాల నాయుడు.
ఆయన అజాత శతృవు. ఆయన అంటే పార్టీలకు అతీతంగా అంతా అభిమానిస్తారు. ఆయన వివాదరహితుడు. మిగిలిన వారిలా పరుష విమర్శలు చేయరు. ఉంటే అమరావతి సచివాలయంలో లేకపోతే తన సొంత నియోజకవర్గంలో అన్నట్లుగానే మంత్రిగా గడిపారు. రోడ్లు బాగులేవు అన్న మాట మాడుగులలో వినిపించదు. ఆయన బాగా వాటిని చేసి చూపించారు. ప్రజా సమస్యలను ఆయన పరిష్కరించడంలో ముందుంటారు.
ఆయన ప్రతీ రోజూ పర్యటిస్తూనే ఉంటారు. అలా వైసీపీకి మాడుగులను కంచుకోటగా చేశారు. నిజానికి మాడుగుల టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఈ సీటుని టీడీపీ గెలుస్తూ వచ్చింది. 2004లో తొలిసారి బ్రేక్ పడింది. నాడు కాంగ్రెస్ అభ్యర్ధిగా కరణం ధర్మశ్రీ గెలిచారు. 2009లో టీడీపీ మరోమారు గెలిచింది.
అయితే 2014 నుంచి మాత్రం ఆ పార్టీకి వరస ఓటములే పలకరిస్తున్నాయి. బూడి అభ్యర్థిగా ఉంటే ఓడించలేము అన్నది విపక్షాలలో ఏర్పడింది అంటే దానికి ఆయన పడిన శ్రమ కారణం. ఇపుడు ఆయనను ఎంపీగా నిలబెడుతున్నారు. దాంతో ఆ సీటుని ఆయన కుమార్తె కె కోటపాడు జెడ్పీటీసీ అయిన ఈర్లి అనూరాధకు ఇచ్చారు.
ఆమె కూడా తండ్రికి అచ్చమైన రాజకీయ వారసురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె మంచి వాక్చాతుర్యం కలిగిన మహిళా నేత. జగన్ ఆమెకు జిల్లా మహిళా నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక మాడుగులలో 16 వేల పై చిలుకు మెజారిటీ 2019 ఎన్నికల్లో బూడికి లభించింది. ఇక్కడ జనసేనకు మూడు వేల ఓట్లు మాత్రమే దక్కాయి. ఇపుడు టీడీపీ జనసేన పోటీకి వచ్చినా కచ్చితంగా వైసీపీ గెలిచే సీటుగా ఉంది.
మరో వైపు చూస్తే టీడీపీ టికెట్ పైలా ప్రసాదరావుకు ఇచ్చారు. ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేస్తే 32 వేల పై చిలుకు ఓట్లు లభించాయి. దాంతో ఆయనకు ఈ సీటు ఖరారు చేశారు. ఈ సీటు మీద మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆశలు పెట్టుకున్నారు. 2014, 2019లలో ఆయనకు రెండు సార్లు అవకాశం ఇచ్చినా ఓటమి పాలు అయ్యారని పక్కకు తప్పించారు. అయిదేళ్ల పాటు మాడుగుల టీడీపీ ఇంచార్జిగా పనిచేసిన పీవీజీ కుమార్ కి కూడా టికెట్ దక్కలేదు. దాంతో ఈ ఇద్దరు నేతలూ వారి వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి.
అయితే పైలా ప్రసాదరావు అనే కొత్త ముఖానికి టికెట్ ఇవ్వడంతో టీడీపీలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇక వైసీపీ కూడా కొత్త ముఖాన్నే తెచ్చింది. దాంతో 2014, 2019లలో బూడి వర్సెస్ గవిరెడ్డి ల పొలిటికల్ ఫైట్ కి తెర పడింది. ఈ ఇద్దరిలో పైలా ప్రసాదరావు కు 2009లో పోటీ చేసిన అనుభవం ఉంది. ఇక బూడి కుమార్తె అనూరాధకు తండ్రి ఎన్నికల్లో తెర ముందు తెర వెనక పనిచేసిన అనుభవం ఉంది. పైగా ఆమె జెడ్పీటీసీగా ఉన్నారు.
అలా ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్నది చర్చగా ఉంది. దాంతో పాటుగా చూస్తే యాభై ఏళ్ల క్రితం మహిళా ఎమ్మెల్యే ఇక్కడ నుంచి గెలిచారు. బొడ్డు కళావతి 1972లో చివరి సారిగా మహిళా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. నాటి నుంచి మళ్లీ మహిళలు ఎవరూ ఎమ్మెల్యే కాలేదు. అది అనూరాధకు అడ్వాంటేజ్ గా మారుతుంది అని అంటున్నారు. బూడి వేసిన బలమైన రాజకీయ పునాది కూడా తోడుగా ఉందని ఆమె కనుక గెలిస్తే అర్ధ శతాబ్దం తరువాత మాడుగులకు తొలి మహిళా ఎమ్మెల్యే అవుతారు అని అంటున్నారు.