Begin typing your search above and press return to search.

మాగంటి రాజ‌కీయం ముగిసిన‌ట్టేనా.. ?

మాగంటి వెంకటేశ్వరరావు ఉర‌ఫ్ బాబు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ నాయకుడు.

By:  Tupaki Desk   |   22 Aug 2024 8:30 AM GMT
మాగంటి రాజ‌కీయం ముగిసిన‌ట్టేనా.. ?
X

మాగంటి వెంకటేశ్వరరావు ఉర‌ఫ్ బాబు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ నాయకుడు. అదే విధంగా ఏలూరు మాజీ ఎంపీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే రాజకీయంగా సీనియర్ నాయకుడు కూడా. అయితే ఇప్పుడు ఈయన రాజకీయం పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు దూరమవుతారా? యాక్టివ్ రాజకీయాలకు ఇక ఫుల్‌స్టాప్ అన్నట్టేనా? అనేది ఇప్పుడు ఏలూరులోనే కాదు టిడిపిలోనూ చర్చ‌గా మారింది.

రాజకీయాల్లో నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇది కామనే. కానీ కొంతమంది నాయకులు మాత్రం బలమైన ముద్ర వేస్తారు. ఇటు పార్టీ పరంగా, అటు ప్రజల పరంగా, నియోజకవర్గ పరంగా వ్యక్తిగతంగా కూడా కొంతమంది నాయకుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి కుటుంబానికి చెందిన నాయకుడే మాగంటి బాబు. తాజా ఎన్నికల్లో ఆయనకు టికెట్టు రాని విషయం తెలిసిందే. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి టికెట్ ఆశించారు. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు నిరాకరించడం ఆ తర్వాత ఆయన మౌనంగా ఉండిపోవడం అందరికీ తెలిసిందే.

అయితే దీనికి ఆయన అనారోగ్య కారణాలు చెబుతున్నప్పటికీ పార్టీలో అంతర్గతంగా ఆయనకు కొంతమంది సహకరించడం లేదనేది మరో వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తర్వాత కూడా మాగంటి బాబు ఎక్కడా ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో దాదాపు 50 సంవత్సరాలకు పైగా మాగంటి కుటుంబం ప్రజలకు అండగా నిలిచింది. లాభాపేక్ష‌లేని అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో మన్ననలు కూడా పొందింది.

అలాంటి కుటుంబం ఇప్పుడు వారసత్వం లేని పరిస్థితిని ఎదుర్కొంటుండడం గమనార్హం. ఎందుకంటే మాగంటి కుమారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాగంటి కూడా అనారోగ్యంతో ఉన్నారని యాక్టివ్ పాలిటిక్స్ చేయ‌లేని పరిస్థితి ఉందని పార్టీలో చ‌ర్చ‌ జరుగుతోంది. ఇంకోవైపు ఆ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎవరూ బయటికి రాలేదు. కాబట్టి ఈ పరిణామాల్ని గమనిస్తే ఇక మాగంటి రాజకీయాలు ముగిసినట్టేనని నిర్ధారించుకునే పరిస్థితి ఏర్పడింది.