Begin typing your search above and press return to search.

ఒక్కరోజులో 155 భూకంపాలు... వణికుస్తున్న సీసీటీవీ వీడియోలు!

సోమవారం సంభవించిన వరుస భూకంపాలు జపాన్ ని అల్లకల్లోలం చేసేశాయి

By:  Tupaki Desk   |   2 Jan 2024 5:00 AM GMT
ఒక్కరోజులో 155 భూకంపాలు... వణికుస్తున్న సీసీటీవీ వీడియోలు!
X

సోమవారం సంభవించిన వరుస భూకంపాలు జపాన్ ని అల్లకల్లోలం చేసేశాయి. ఒక్కరోజులో సుమారు 155 సార్లు భూమి కంపించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ భారీ భూకంపంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. పలు రోడ్లపై భారీగా పగుళ్లు వచ్చాయి. ఈ సమయంలో భూకంప తీవ్రతను తెలియజేసే సీసీటీ ఫుటేజీ వీడియోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

అవును... జపాన్‌ ను భారీ భూకంపం కుదిపేసింది. ఇందులో భాగంగా.. రిక్టర్ స్కేల్‌ పై 7.6 తీవ్రతో ఈ భూకంపం నమోదైనట్లు జపాన్‌ వాతారణ సంస్థ వెల్లడించింది. ఈ ఘటనల్లో కనీసం 13 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. ప్రధానంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఇషికావాలో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు జపాన్‌ వాతావరణ సంస్థ నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికలను కంటిన్యూ చేస్తుంది. ఇందులో భాగంగా మరోసారి భూప్రకంపనలు సంభవించే అవకాశం, సునామీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదే సమయంలో రష్యా, ఉత్తర కొరియాలోనూ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

ఇదే సమయంలో ఇషికావా ప్రిఫెక్చర్‌ లోని షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ లో స్వల్ప స్థాయి పేలుడు సంభవించిందని.. ఫలితంగా ఏదో కాలిపోతున్న వాసన వచ్చిందని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. అదేవిధంగా సుమారు 50కి పైగా ఇళ్లు కుప్పకూలినట్లు తమకు సమాచారం అందిందని ఇషికావా అగ్నిమాపక కేంద్రం వెల్లడించింది.

సమయంతో పోటీ పడుతున్న సహాయక బృందాలు:

జపాన్ లో సంభవించిన ఈ వరుస భూకంపాలపై ఆ దేశ ప్రధాని పుమియో కిషిదా స్పందించారు. ఇందులో భాగంగా... సోమవారం సంభవించిన భూకంపాల్లో తీవ్ర నష్టం సంభవించిందని, భవనాలు కుప్పకూలాయని, అగ్ని ప్రమాదాలు సంభవించాయని, అనేకమంది ప్రాణాలు కోల్పాయారని వెల్లడించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు సమయంతో పోటీ పడుతున్నామని వ్యాఖ్యానించారు.

పెద్దన్న రియాక్షన్!:

జపాన్ లో సంభవించిన వరుస భూకంపాలపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. ఇందులో భాగంగా.. జపాన్ అధికారులతో అమెరికా సంప్రదింపులు జరుపుతోందని, జపాన్ ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.