Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్కర్ స్కాం... కవితను మాగుంట ఫిక్స్ చేసినట్లేనా?

ఇదే కేసులో ఏప్రిల్ 11 న సీబీఐ అరెస్ట్ చేసింది. నాటి నుంచీ ఆమె తీహార్ జైల్ లోనే ఉంటున్నారు. ఈ సమయంలో ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   28 July 2024 2:45 AM GMT
ఢిల్లీ లిక్కర్ స్కాం... కవితను మాగుంట ఫిక్స్ చేసినట్లేనా?
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలోని మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వెళ్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 11 న సీబీఐ అరెస్ట్ చేసింది. నాటి నుంచీ ఆమె తీహార్ జైల్ లోనే ఉంటున్నారు. ఈ సమయంలో ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది!

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (సీబీఐ) కేసులు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత విషయంలో... ఒంగోలుకు చెందిన తెలుగుదేశం ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారిందని.. దీన్ని ఆధారం చ్చేసుకుని కవిత చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించిందని అంటున్నారు!

ఢిల్లీలోని కోర్టులో కవితపై అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ... మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ లు ఇచ్చిన వాంగ్మూలాలు ఈ కేసులో కవిత పాత్రను తేటతెల్లం చేసున్నాయని సీబీఐ పేర్కొందని అంటున్నారు. ఇదే సమయంలో... మార్చి 2021లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఆయన ఆఫీసులోనే మాగుంట కలిశారని.. మద్యం వ్యాపారంలో మద్దతు కోసం అభ్యర్థించారని సీబీఐ పేర్కొందని తెలుస్తోంది.

అనంతరం... మాగుంట అభ్యర్థనను మన్నించిన కేజ్రీవాల్.. కవితను సంప్రదించాలని కోరారనేది సీబీఐ ఆరోపణగా ఉంది! ఇదే సమయంలో... తన అభ్యర్థనను మన్నించి మద్దతు ఇస్తున్నందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సాయం అందించాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కేజ్రీవాల్ చెప్పారని సీబీఐ పేర్కొందని తెలుస్తోంది! ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్ పాలసీలోని కుట్రదారుల్లో కవిత ఒకరనే విషయం మాగుంట వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అఫిడవిట్ లో కోర్టుకు తెలిపింది!

ఇలా లిక్కర్ పాలసీని తారుమారు చేయడం, సర్దుబాట్లు చేయడంతో పాటు.. సుమారు రూ.100 కోట్లు అక్రమంగా సంపాదించిన సొమ్మును హవాలా ద్వారా గోవాకు తరలించడంలోనూ కవిత పాత్ర ఉందని ఛార్జిషీట్ లో దర్యాప్తు సంస్థ పేర్కొందని అంటున్నారు. ఈ హవాలా వ్యవహారంలోనే ఆమె సహ నిందితులు అభిషేక్ బోయినపల్లి, పీఏ అశోక్ కౌశిక్ ల ప్రమేయం కూడా ఉన్నట్లు ఛార్జి షీట్లో వెల్లడించింది!!

కాగా... ఈ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తో పాటు కవిత జ్యుడీషియల్ కస్టడీనీ జూలై 31 వరకూ ఢిల్లీ కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే. వీరిని తీహార్ జైల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు.