అతడో ఐఐటీయన్.. కట్ చేస్తే కాషాయ దుస్తుల్లో..
1992లో బెనారస్ హిందూ యూనివర్శినటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆచార్య జైశంకర్ నారాయణన్ కొంతకాలం టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేశారు.
By: Tupaki Desk | 28 Jan 2025 2:30 AM GMTయూపీలోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా ఎన్నో ఆసక్తికర విశేషాలను ఆవిష్కరిస్తోంది. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఇలాంటి మహత్కార్యంలో కోట్లాను కోట్ల మంది భక్తులు భాగస్వాములు అవుతున్నారు. అయితే కొందరు మాత్రం చర్చనీయాంశం అవుతున్నారు. పూర్తిగా హిందూ మతం కట్టుబాట్లతో జరుగున్న ఈ కుంభమేళాలో విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు పాలుపంచుకుంటూ పునీతులు అవుతుండగా, దేశంలోని మేథావులుగా గుర్తింపు పొందిన వారు సైతం తమ జీవ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు.
మహా కుంభమేళాలో యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ తన పేరును కమలగా మార్చుకున్నారు. అంతేకాకుండా హిందూ మతాన్ని ఆచరిస్తున్నట్లు ఆమె పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మమతా కుల్‌కర్ణి సన్యాసినిగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో మహా కుంభమేళాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహా కుంభమేళా విశిష్ఠతకు ఆకర్షితులవుతూ చాలా మంది ప్రయాగ్ రాజ్ బాటపడుతున్నారు.
ఈ నెల 12న మొదలైన ఈ మహా కుంభమేళా వచ్చే నెల 26 వరకు కొనసాగుతుంది. మొత్తం 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. అయితే ఇప్పటికే దాదాపు 10 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో యాత్రికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంచితే మహా కుంభమేళాలో ఎవరూ ఊహించని వ్యక్తులు హాజరవుతూ చర్చకు తావిస్తున్నారు. సన్యాసులుగా మారిన అపర మేథావులు ఈ మహా కుంభమేళా సందర్భంగా బయటకు వస్తుంటంతో అంతా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.
జీవితంలో ఎంతో సాధించి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, ఏదో అసంతృప్తితో ఆధ్యాత్మికత వైపు మళ్లిన వారు ఈ మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఐఐటీ గ్రాడ్యుయేట్ జైశంకర్ నారాయణన్ ఒకరు. ఆయన కథ వింటే విలాశవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా ఎలా వదిలేశారని ఆశ్చర్యం పోతాం...
1992లో బెనారస్ హిందూ యూనివర్శినటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆచార్య జైశంకర్ నారాయణన్ కొంతకాలం టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1993లో అమెరికాకి వెళ్లాలని ప్లాన్ చేసిన ఆయన అనుకోకుండా స్వామి దయానంద సరస్వతిని కలిశారట. దయానంద సరస్వతి వేదాంత బోధనలకు ఆకర్షితుడైన ఆచార్య జైశంకర్ నారాయణన్ అన్నింటిని పరిత్యజించి సన్యాసం స్వీకరించారు. 1995లో అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన జైశంకర్ నారాయణ్ నేరుగా గురుకులంలో చేరి వేదాన్ని అధ్యయనం చేశారు. అలా సన్యాసిగా మారి 20 ఏళ్లుగా దయానంద సరస్వతి ఆశ్రమంలో వేదాంతం, సంస్కృతం బోధిస్తున్నారు.
ఇప్పుడు మహా కుంభమేళాలో చురుగ్గా పాల్గొంటున్న జైశంకర్ నారాయణన్ మాట్లాడుతూ, తాను ఐఐటీ సాధించినప్పుడు గొప్ప విజయం సాధించాననే అనుభూతి కలిగిందని, ఆ తర్వాత చాలా మంది ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక ఇదేమంత గొప్ప విషయం కాదని భావించానని చెప్పారు. అన్ని విజయాలు అప్పటికప్పుడు మాత్రమే ఆనందమిస్తాయని ఆ తర్వాత అవన్నీ సాధారణమేనవి తెలుస్తుందని చెప్పారు. ఆత్మానందం ఇవ్వగలదని అనిపించిందే నిజమైన విజయమన్నారు. అలా తాను అన్నింటిని త్యజించి సన్యాసం స్వీకరించానని చెప్పుకొచ్చారు. ఈ మహా కుంభమేళాలో ఎందరో గొప్ప గొప్ప మేథావులను కలుసుకుంటున్నానని ఆనందం వ్యక్తం చేశారు.