Begin typing your search above and press return to search.

ముగిసిన మహా కుంభమేళా.. మళ్లీ ఎప్పుడంటే..?

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ముగిసింది. చివరిరోజైన బుధవారం భక్తులు భారీగా పోటెత్తారు.

By:  Tupaki Desk   |   27 Feb 2025 3:58 AM GMT
ముగిసిన మహా కుంభమేళా.. మళ్లీ ఎప్పుడంటే..?
X

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ముగిసింది. చివరిరోజైన బుధవారం భక్తులు భారీగా పోటెత్తారు. ప్రధానంగా చివరి రోజు కావడంతోపాటు మహా శివరాత్రి పర్వదినం కూడా కలిసిరావడంతో త్రివేణీసంగమం ఘాట్లు శివనామస్మరణలతో మార్గ్మోగాయి. ఈ క్రమంలో రికార్డ్ స్థాయిలో భక్తులు మహా కుంభమేళాలో స్నానమాచరించినట్లు ప్రభుత్వం తెలిపింది!

అవును.. మహా కుంభమేళాలో చివరి అమృతస్నానం ఆచరించేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే పెద్దసంఖ్యలో ఘాట్ల వద్దకు చేరుకొన్నారు. ఈ సమయంలో.. శివాలయం పర్వదినం సందర్భంగా కుంభమేళా ప్రాంతంలోని ఐదు ప్రధాన శివాలయాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మహత్తర కార్యక్రమం 45 రోజుల పాటు సాగి నిన్న ముగిసింది.

జనవరి 13న మొదలై నాగ సాధువుల ఊరేగింపులు, మూడు అమృత స్నానాలతో వైభవంగా 45 రోజుల పాటు కొనసాగిన మహా కుంభమేళా ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం 66.21 మంది భక్తులు పుణ్య స్నానమాచరించారు. ఈ కార్యక్రమం చివరి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆదిత్యనాథ్.. అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా స్పందించిన యూపీ సీఎం... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అఖాడాలు, సాధువులు, మహామండలేశ్వర్ల ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ఈ మహా కుంభమేళాలో భాగమైన భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇలా 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా నిన్నటితో ముగియగా.. మళ్లీ ఎప్పుడు అనే చర్చ తెరపైకి సహజంగానే వచ్చింది. అయితే.. తిరిగి మళ్లీ 2169 సంవత్సరంలో ఈ మహా కుంభమేళా జరగనుంది. కాగా.. అంతకు ముందు 1881లో ఈ మహా కుంభమేళా జరిగింది. అంటే.. రాబోయే తరాలు ఈ మహా ఘట్టంలో భాగం కానున్నాయన్నమాట.

ఇక.. ఈ మహా కుంభమేళాలో ఓ విషాద ఘటన కూడా జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 29న రెండో అమృతస్నానం సందర్భంగా రద్దీ వల్ల జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోయినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. మరికొంతమంది భక్తులు గాయపడినట్లు వెల్లడించింది. ఈ విషాద ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది.

ఈ మహా కార్యక్రమంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్, రాష్ట్రపతి దౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, సినీతారలు, వివిధ రంగాల్లో ప్రముఖులు పాల్గొని పుణ్యస్నానాలు చేసిన సంగతి తెలిసిందే.