బిగ్ చాలెంజ్ : యోగీ... కుంభమేళా నీరు తాగండి !
ఇక ఫిబ్రవరి 3 నాటికి ఇచ్చిన నివేదికలో చూస్తే మహా కుంభమేళా నదీ జలాల్లో అన్ని ప్రదేశాల్లోనూ కోలిఫాం స్థాయి 100 మిల్లీ మీటర్లకు 2500 యూనిట్లు ఉందని స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 20 Feb 2025 4:04 AM GMTమహా కుంభమేళ గత నలబై రోజుల నుంచి వైభవంగా సాగుతోంది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు 55 కోట్లు పైదాటి వచ్చారు. ఇంకా తరలివస్తున్నారు. ఈ నెల 26న మహా శివరాత్రితో కుంభమేళా పూర్తి అవుతుంది. ఆ రోజుకు అరవై నుంచి అరవై అయిదు కోట్ల మంది మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తారు అన్నది ఒక అంచనా ఉంది.
ఎంతో మంది ప్రముఖులు కుంభమేళాలో స్నానాలు ఆచరించారు. ఇంకా వస్తున్నారు. అయితే కుంభమేళా నీటిలో హానికరమైన బ్యాక్టీరియా ఉందని చర్చ సాగుతోంది. ఇక చూస్తే జనవరి 12, 13 తేదీలలో మహా కుంభమేళా నీటిని పరీక్షించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. వివిధ సందర్భాలలో పరిశీలించిన మేరకు స్నానం చేయడానికి నది నీటి నాణ్యత అనుగుణంగా లేదని తేల్చింది. నీటిలో ఫీకల్ కోలిఫాం అధికంగా ఉందని పేర్కొంది.
ఇక ఫిబ్రవరి 3 నాటికి ఇచ్చిన నివేదికలో చూస్తే మహా కుంభమేళా నదీ జలాల్లో అన్ని ప్రదేశాల్లోనూ కోలిఫాం స్థాయి 100 మిల్లీ మీటర్లకు 2500 యూనిట్లు ఉందని స్పష్టం చేసింది. ఇది అనుమతించిన పరిమితి కంటే చాలా రెట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఇక కుంభమేళా పవిత్ర దినాలలో బాక్టీరియా మరింతగా పెరిగిపోతోందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
మరో వైపు చూస్తే ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రం మండలి అయితే కుంభమేళా నీరు సురక్షితంగా ఉందని చెబుతోంది. దీని మీద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే విచారిస్తోంది. గంగ యమున సరస్వతి త్రివేణీ సంగమంలో నీటి నాణ్యత విషయంలో తీసుకున్న చర్యల గురించి ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న చర్యలను తెలియచేయాలని కోరింది.
మహా కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది నవంబర్ నాటికే నదిలోకి మురుగు నీరు ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నామని ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు బెంచ్ కి తెలియచేశారు. అలాగే పారిశ్రామిక వ్యర్థాలు రాకుండా చూసుకున్నామని చెబుతున్నారు. అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదిక మాత్రం దీనితో విభేదిస్తోంది. సంగమం వద్ద నీటిలో బాక్టిరియా హెచ్చుగానే ఉందని తన నివేదిక ఇస్తోంది.
ఇలా చూస్తే కనుక కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదికలలో భారీ తేడా కనిపిస్తోంది. దీని మీద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ అయితే కచ్చితంగా అన్నీ ఉండాలని కోరుతోంది. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లోని గంగా నదిలో కోలిఫాం ఆక్సిజన్ స్థాయిలు వంటి ఇతర నీటి నాణ్యత పరిమితుల మీద తగిన వివరాలను సమర్పించనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
గంగ, యమునా నదుల్లో నీరు తాగేందుకు, స్నానం చేసేందుకు అనువుగా ఉండేలా చూడాలని యూపీ ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని గతంలోనే ఆదేశించిన నేపథ్యంలో తీసుకున్న చర్యలను కూడా సమీక్షించింది. అయితే యూపీ అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్, సీపీసీబీ నివేదికలో వెల్లడించిన అంశాలను యూపీపీసీబీ పరిశీలిస్తుందని నీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ట్రిబ్యునల్ కి ఒక నివేదికను సమర్పించారు.
ఈ క్రమంలో నీటి నాణ్యత మీద చర్చ అయితే సాగుతోంది. దీని మీద యూపీ సీఎం యోగి మాట్లాడుతూ నీటి నాణ్యత మీద సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి బాక్టీరియా లేదని ఆ నీటిని తాగొచ్చని కూడా పేర్కొన్నారు.
ఆయనను ఈ విషయంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ మహా కుంభమేళా నీటిలో ఫీకల్ బాక్టీరియా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదికని యోగి ఖండించడాన్ని తప్పు పట్టారు. యోగీ ఆయన మంత్రి వర్గ సహచరులు ఆ నీటిని తాగాలని ఆయన సవాల్ చేశారు. మీరు ఒక గ్లాస్ నీటిని తాగి జనాలకు చూపించండి అని ఆయన కోరుతున్నారు. మరో వారంలో కుంభమేళా ముగుస్తున్న వేళ రాజుకున్న ఈ నీటి వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.