తెలంగాణలో మళ్లీ భూప్రకంపనలు... ఈసారి తీవ్రత ఎంతంటే..?
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం తెలంగాణలో మరోసారి భూమి కంపించింది.
By: Tupaki Desk | 7 Dec 2024 9:48 AM GMTఈ నెల 4న తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భూకంపం.. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని పరిశోధకులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం తెలంగాణలో మరోసారి భూమి కంపించింది.
అవును... తెలంగాణలో మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. ఇందులో భాగంగా... మహబూబ్ నగర్ జిల్లాల్లో శనివారం మరోసారి భూమి కంపించింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఈ తాజా భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు చెబుతున్నారు. జిల్లాలోని కౌకుంట్ల మండలం, దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని అంటున్నారు.
కాగా.. ఈ నెల 4న ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూమి లోపల సుమారు 40 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని చెబుతుండగా.. తీవ్రత 5.3గా నమోదైన ఈ భూకంపం ప్రభావంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, హన్మకొండ, భద్రాచలం తో పాటు ఏపీలోని పలు ప్రాంతల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే.
దీంతో... భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. దీనిపై స్పందించిన శాస్త్రవేత్తలు.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూమి పొరల మధ్య తేడాలు ఏర్పడతాయని.. అందుకే పలుమార్లు సర్దుబాటు కారణంగా భూకంపాలు సంభవిస్తాయని తెలిపారు. ఈ క్రమంలో దానికి కొనసాగింపుగా మరికొన్ని స్వల్ప భూకంపాలు వస్తాయని అన్నారు.
ఇదే సమయంలో... ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రానికి చుట్టూ 232 కిలోమీటర్ల పరిధిలో భూప్రకంపనలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ సమయంలో తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల్లోనూ భూమి కంపించినట్లు కథనాలొచ్చాయి! అయితే... 5.0 కంటే అధికంగా దక్షిణ భారత దేశంలో భూమి కంపించడం ఇదే తొలిసారని అంటున్నారు!