Begin typing your search above and press return to search.

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో నెల‌కు 6000 కోట్ల సంపాద‌న‌

ED అందించిన వివ‌రాల‌ ప్రకారం.. వారిద్దరూ భారతదేశంలో బెట్టింగ్ కోసం 4000-ప్యానెల్ ఆపరేటర్లను ఎంపిక చేసారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:52 PM GMT
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో నెల‌కు 6000 కోట్ల సంపాద‌న‌
X

మహదేవ్ బెట్టింగ్ స్కామ్‌కు సంబంధించి త‌వ్వే కొద్దీ షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ కేసులో స్టార్ హీరో రణబీర్ కపూర్ - కమెడియన్ కపిల్ శర్మ- శ్ర‌ద్ధా క‌పూర్- హూమా ఖురేషి- హీనా ఖాన్ త‌దిత‌రుల ప్రమేయం ఉంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. వీరంద‌రికీ ఈడీ స‌మ‌న్లు పంపింది. మనీలాండరింగ్ నిరోధక సంస్థ ముంబైలోని తన కార్యాలయంలో విచార‌ణ‌కు వీరంతా హాజరు కావాలని కోరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోల్‌కతా, భోపాల్, ముంబై మొదలైన నగరాల్లో మహాదేవ్ యాప్‌తో అనుసంధాన‌మై ఉన్న మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌లపై సోదాలు నిర్వహించింది. పెద్ద మొత్తంలో నేరారోపణ సాక్ష్యాలను పొందింది. సుమారు రూ.417 కోట్ల విలువైన క్రైమ్ ఆదాయాన్ని స్తంభింప(జప్తు)జేసింది.

ఈ కేసుకు సంబంధించి పలువురు ఎ-లిస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేయ‌గా, రణబీర్ కపూర్ ED ముందు హాజరు కావడానికి ఒక వారం సమయం అభ్యర్థించారు. అయితే కపిల్ శర్మ - హుమా ఖురేషి మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ కేసుకు సంబంధించి నిన్న ED కార్యాలయాన్ని సందర్శించ‌గా, నేడు (06 అక్టోబ‌ర్) శ్ర‌ద్ధా క‌పూర్ విచార‌ణ సాగింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

మిలియన్ డాలర్ల అంపైర్ గ్యాంబ్లింగ్ వ్యాపారాన్ని నిర్వహించే ముందు, చంద్రకర్ బిలాయ్ లోని నెహ్రూ నగర్‌లో జ్యూస్ దుకాణాన్ని నడిపేవాడు. ఇద్దరూ జూదానికి అలవాటు పడకముందే వారికి సంబంధాలు ఉన్నాయ‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. వీరిద్దరూ దుబాయ్‌ వెళ్లి షేక్ ల‌ను, పాకిస్థాన్‌ జాతీయుడిని కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌పంచ దేశాల‌తో హ‌వాలా వ్యాపారం ప్రారంభించార‌ని ఈడీ పేర్కొంది.

ED అందించిన వివ‌రాల‌ ప్రకారం.. వారిద్దరూ భారతదేశంలో బెట్టింగ్ కోసం 4000-ప్యానెల్ ఆపరేటర్లను ఎంపిక చేసారు. ఒక్కో ప్యానెల్‌లో 200 మంది కస్టమర్‌లు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో చంద్రాకర్‌, ఉప్పల్‌లు రోజూ రూ.200 కోట్లు సంపాదిస్తున్నారని, నెల మొత్తం ఆర్జిస్తే 6000 కోట్లు ఉంటుంద‌ని ఈడీ నిగ్గు తేల్చింది.

విచార‌ణ‌లో చేదు నిజాలు:

మహాదేవ్ గేమింగ్ యాప్ తో అనుసంధాన‌మైన‌ వినియోగదారులు ఎన్ని ర‌కాలు? అన్న‌ది ఆరా తీస్తే ఆశ్చ‌ర్య‌పోయే విష‌యాలు తెలిసాయి. పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్‌లు, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ , క్రికెట్ వంటి వివిధ ఆటలపై జూదం ఆడటానికి అనుమతించే యాప్ ఇది. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి తర్వాత ఈడీ దర్యాప్తుతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. రస్ అల్-ఖైమాలో జరిగిన తన వివాహ వేడుకలో సౌరభ్ చంద్రకర్ తన కుటుంబ సభ్యులను నాగ్‌పూర్ నుండి UAEకి తీసుకువెళ్లడానికి ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకున్నాడు. ప‌లువురు హిందీ స్టార్ల‌తో వినోద కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసారు. ఈ పెళ్లికి 200కోట్లు ఖ‌ర్చ‌వ‌గా ప్ర‌తి రూపాయిని న‌గ‌దు రూపంలో చెల్లించ‌డంతో ఈడీకి సందేహాలు క‌లిగాయి.

ED వెల్లడించిన వివ‌రాల‌ ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన ప్రమోటర్ చంద్రకర్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్‌ను కొత్త వినియోగదారులను నమోదు చేసుకోవడానికి, IDలను సృష్టించడానికి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండరింగ్ చేయడానికి ఉపయోగించినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుండి రన్ అవుతుందని ఇడి దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఇది ప్యానెల్బ్రాం లేదా బ్రాంచ్‌ల కు 70-30 లాభాల నిష్పత్తిలో (తెలిసిన వారి సహచరులకు) ఫ్రాంఛైజ్ ఇవ్వ‌డం ద్వారా కార్య‌క‌లాపాల‌ను నిర్వహిస్తుంది. బెట్టింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు మళ్లించేందుకే పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగుతున్నాయని ఈడీ పేర్కొంది.

మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవస్థాపకుల గురించి వివ‌రాల్లోకి వెళితే.. సౌరభ్ చంద్రకర్ - రవి ఉప్పల్ మనీలాండరింగ్ బిడ్‌ల వెనుక సూత్రధారులు అని ఈడీ పేర్కొంది. తాజా మీడియా నివేదిక ప్రకారం మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ UAE ప్రధాన కార్యాలయం నుండి భారతదేశం, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్‌లతో నెట్‌వర్క్ క‌లిగి ఉంది.

బాలీవుడ్ సెలబ్రిటీల లింకేంటి?

ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రకర్ వివాహానికి .. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన కంపెనీ సక్సెస్ పార్టీకి హాజరై వినోద‌ ప్రదర్శన ఇచ్చిన పలువురు బాలీవుడ్ తారలు ED స్కానర్ కి చిక్కారు. తారలు వివాహానికి హాజరైనందుకు లేదా ప్రదర్శన కోసం చెల్లింపుగా భారీ మొత్తంలో నగదును స్వీకరించినట్లు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌ద‌ర్శ‌న‌కు న‌గ‌దు రూపంలో కాకుండా వేర్వేరు మార్గాల్లో స్వీక‌రించార‌ని ఈడీ చెబుతోంది.