బెట్టింగ్ స్కాం: జ్యూస్ షాప్ నుంచి 200కోట్ల వెడ్డింగ్ వరకూ..
ఇంతకీ జూస్ విక్రేత పేరేమిటి? అంటే.. సౌరభ్ శుక్లా. అతడు కొందరు భాగస్వాములతో కలిసి బెట్టింగ్ యాప్ స్కామ్ కి తెర తీసాడు
By: Tupaki Desk | 6 Oct 2023 5:35 AM GMTమహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. ఒక సాధారణ జ్యూస్ విక్రేత నుండి రూ.200 కోట్ల విలాసవంతమైన వివాహానికి అతడు (స్కామ్ స్టర్) ఎలా ఎదిగాడు? అన్నది ప్రజల్లో హాట్ టాపిక్. సినీక్రీడా ప్రముఖుల ప్రమేయంతో బెట్టింగ్ యాప్ లను నిర్వహిస్తూ హవాలా దందా కొనసాగిస్తూ అతడు సాగించిన డేంజర్ గేమ్ పై ఇప్పుడు ఈడీ పూర్తి స్థాయిలో విచారిస్తోంది. ఈ కేసులో దాదాపు 14-15 మంది సెలబ్రిటీలు, నటీనటులు ఈడీ స్కానర్‌లో ఉన్నారని, వారికి కూడా త్వరలో సమన్లు అందజేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇంతకీ జూస్ విక్రేత పేరేమిటి? అంటే.. సౌరభ్ శుక్లా. అతడు కొందరు భాగస్వాములతో కలిసి బెట్టింగ్ యాప్ స్కామ్ కి తెర తీసాడు. శుక్లా సహా కంపెనీ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్ తో ఆట మొదలు పెట్టారు. ఈ యాప్ అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్‌లను ప్రారంభించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేసే గొడుగు సిండికేట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ ఫిబ్రవరిలో జరిగిన విలాసవంతమైన వివాహం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టిని ఆకర్షించడంతో అసలు గుట్టు రట్టయింది. దాదాపు రూ.200 కోట్లు పెళ్లి వేడుకకు ఖర్చు చేయగా, ఆ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించడంతో ఈడీకి అనుమానాలు వచ్చాయి.
మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుండి రన్ అవుతుందని ఈడి దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. సౌరభ్ చంద్రకర్- రవి ఉప్పల్ ప్రమోట్ చేసిన కంపెనీ దుబాయ్ కేంద్రంగా రన్ అవుతోంది. కొత్త వినియోగదారులను నమోదు చేసుకోవడానికి, IDలను సృష్టించడానికి.. బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండరింగ్ చేయడానికి ఇది ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందని ఏజెన్సీ ఆరోపించింది.
రకరకాల కథనాలు అందించిన సమాచారం ప్రకారం.. సౌరభ్ చంద్రకర్ బిలాయ్ లో జ్యూస్ విక్రేతగా కొనసాగాడు. ఎంతో వినయవిధేయత కలిగిన వాడు. మాట తీరుతోనే ఆకట్టుకోవడం అతడి ప్రత్యేకత. అవతలివాడు ఎంతటి ప్రమఖుడైనా సులువుగా బుట్టలో వేయడం అతడి నైపుణ్యం అని కూడా ఓ కథనం పేర్కొంది.
రస్ అల్-ఖైమాలో జరిగిన శుక్లా వివాహ వేడుకలో, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్, నాగ్‌పూర్ నుండి UAEకి కుటుంబ సభ్యులను రవాణా చేయడానికి ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకున్నాడు. పెళ్లిలో వినోదం కోసం స్టార్లకు భారీ మొత్తాన్ని చెల్లించినట్లు ED తెలిపింది. వెడ్డింగ్ ప్లానర్లు, డ్యాన్సర్లు, డెకరేటర్లు మొదలైన వారిని ముంబై నుండి నియమించుకున్నారు. నగదు రూపంలో చెల్లింపులు చేయడానికి హవాలా ఛానెల్‌లను ఉపయోగించారు. ఆకస్మిక అక్రమ సంపదను వారు బహిరంగంగా ప్రదర్శించారని ED ఒక ప్రకటనలో తెలిపింది.
రాయ్‌పూర్‌లోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు కూడా అనుమానితులపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్‌కు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లో సోదాలు నిర్వహించి బెట్టింగ్ సిండికేట్ చీఫ్ లైజనర్ సహా నలుగురు నిందితులను అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థ సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇస్తున్నట్లు ఈడీ ఆరోపించింది.
ఈ సంస్థ UAEలోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుండి నడుస్తుంది. 70 శాతం-30 శాతం లాభ నిష్పత్తిలో వారి తెలిసిన అసోసియేట్‌లకు ఫ్రాంఛైజ్ చేయడం ద్వారా నిర్వహిస్తారు. ఆదాయాన్ని తగ్గించడానికి పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు జరుగుతాయి. ఆఫ్-షోర్ ఖాతాలకు బెట్టింగ్ చేయడం.. కొత్త వినియోగదారులను .. ఫ్రాంచైజ్ (ప్యానెల్) అన్వేషకులను ఆకర్షించడానికి అవసరమైన బెట్టింగ్ వెబ్‌సైట్‌ల ప్రకటనల కోసం భారీ మొత్తం ఖర్చు చేసారు. భారతదేశంలో కూడా పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేసారని ED విచారణలో తెలిపింది.
ED స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాల ప్రకారం.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ - యోగేష్ పోపాట్‌కు చెందిన R-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి హవాలా ఛానెల్ ద్వారా రూ.112 కోట్లు బట్వాడా అయింది. రూ.42 కోట్ల విలువైన హోటల్ బుకింగ్‌లు డైరెక్ట్ మనీ చెల్లించడం ద్వారా జరిగాయి. అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లో నగదును చెల్లించారు. సోదాల్లో లెక్కల్లో చూపని రూ.2.37 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ ఎంటిటీలకు మద్దతు ఇస్తున్నారని, సందేహాస్పద లావాదేవీల ద్వారా వీరందరిపైనా అనుమానాలొచ్చాయి. భారీగా పారితోషికాలు అడగడానికి బదులుగా యాప్ ప్రచారం కోసం సహకరిస్తున్నారని కూడా ఈడీ కనుగొంది. సెలబ్రిటీలందరికీ చివరికి ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చే ఆదాయం నుండి చెల్లిస్తారని కూడా ఈడీ చెబుతోంది. మహాదేవ్ యాప్ ప్రమోటర్లు, కుటుంబం, బిజినెస్ అసోసియేట్‌లు, సెలబ్రిటీల మొత్తం టికెటింగ్ కార్యకలాపాలకు ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది. అవసరమైన ఖర్చులను భరిస్తుంది.
బెట్టింగ్ ప్యానెళ్ల నుండి వచ్చిన అక్రమ నగదు ఆదాయాన్ని అహుజా సోదరులైన మెయిన్ టికెట్ ప్రొవైడర్‌ల వద్ద తెలివిగా జమ చేశారు. వాలెట్ బ్యాలెన్స్ దేశీయ అంతర్జాతీయ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఉపయోగించారు. సెప్టెంబరు నెలలో UAEలో నిర్వహించే వార్షిక స్టార్-స్టడెడ్ ఈవెంట్ సహా మహాదేవ్ గ్రూప్‌లోని చాలా ఈవెంట్‌లకు ప్రయాణం, బస ఏర్పాట్లు చేయడంలో రాపిడ్ ట్రావెల్స్ నిమగ్నమై ఉంది అని ED తెలిపింది. ఈ స్కామ్ తో ప్రమేయం ఉన్న ఇతర కీ ప్లేయర్స్ ఎవరో విజయవంతంగా గుర్తించినట్లు ED పేర్కొంది.