Begin typing your search above and press return to search.

మెట్రోకు 'మహాలక్ష్మి' ఎఫెక్ట్..

ఆశించిన విధంగా వస్తున్న సర్వేలకు తోడు మేనిఫెస్టోతో భారీ మెజారిటీ దిశగా అడుగులు వేయవచ్చని పార్టీ భావించింది.

By:  Tupaki Desk   |   9 Dec 2023 1:14 PM GMT
మెట్రోకు మహాలక్ష్మి ఎఫెక్ట్..
X

కొత్తగా కొలువు దీరిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను వేగవంతం చేసింది. అధికారం చేపట్టిన రోజు నుంచే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూసుకుపోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొలువుదీరుతుందని మొదటి నుంచి సర్వేలు చెప్తున్నా.. సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెట్టడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గలేదు. ఆశించిన విధంగా వస్తున్న సర్వేలకు తోడు మేనిఫెస్టోతో భారీ మెజారిటీ దిశగా అడుగులు వేయవచ్చని పార్టీ భావించింది. ఇందులో భాగంగానే ఆరు హామీలను ప్రకటించింది. అందులో ఒకటి ‘మహాలక్ష్మి’ పథకం.

‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకాన్ని డిసెంబర్ 9 (శనివారం)వ తేదీన మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ప్రధానమైనవి ఆరు హామీలను వంద రోజుల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రేవంత్ ప్రభుత్వం. ఇందులో ఉచిత రవాణా పథకం మహాలక్ష్మిని కేవలం రెండు రోజుల్లోనే ప్రారంభించారు.

ఈ పథకం కింద సిటీ, సబర్బన్, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రం మొత్తం వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ పథకంలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రం దాటితే మాత్రం వారికి పథకం వర్తించదు. అయితే, ఆధార్ కార్డు వెంట ఉంచుకోవాలని మాత్రం చెప్తున్నారు.

మహాలక్ష్మి పథకం ప్రారంభం కాగానే సిటీ జనాభా ప్రయాణంలో మార్పు స్పష్టంగా కనిపించింది. సిటీ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ కావడంతో మహిళలు ఎక్కువగా వాటినే ఆశ్రయించారు. ఈ రోజు (డిసెంబర్ 09) హైదరాబాద్ మెట్రోలో చాలా వరకు మహిళా కంపార్ట్ మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్ లో మహిళా కంపార్ట్ మెంట్లు ఖాళీగా కనిపించాయి. సికింద్రాబాద్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలు, ఆటోలకు భారీగా గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. ఇక లోకల్ బస్టాండ్లలో రద్దీ విపరీతంగా కనిపించింది. ఉచిత ప్రయాణాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఆర్టీసీ అధికారులు కూడా మహిళలను గౌరవిస్తూ ఆహ్వానించిన దృశ్యాలు కనిపించాయి. ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మితో ప్రయాణ ఖర్చుల సమస్యలు పూర్తిగా తీరాయని మహిళలు చెప్తున్నారు.