మహారాష్ట్ర ఫలితాలు : కూటమి వైసీపీల మీద ప్రభావం ?
రాజకీయం అలాంటిది మరి. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా దాని ప్రభావం అంతటా పడుతుంది.
By: Tupaki Desk | 19 Nov 2024 3:33 AM GMTరాజకీయం అలాంటిది మరి. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా దాని ప్రభావం అంతటా పడుతుంది. ఇపుడు దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం అయిన మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 20న మహారాష్ట్ర ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. మొత్తం 288 అసెంబ్లీ సీట్లను గాను జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏ వైపు మొగ్గు చూపిస్తారో చూడాల్సి ఉంది.
మహారాష్ట్ర గత రెండేళ్ళుగా అధికారంలో ఉంటూ వచ్చిన బీజీపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి జనాలు చాన్స్ ఇస్తారా అన్నది ఒక చర్చ అయితే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మెజారిటీ ఎంపీ సీట్లు ఇచ్చిన మహా ఓటర్లు అసెంబ్లీ పీఠం కూడా అప్పగిస్తారా అన్నది మరో చర్చ.
ఇదిలా ఉంటే సాధారణంగా చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి కొంత యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దానిని అధిగమించి అధికారంలోకి రావడం అన్నది ఒక సవాల్ గా ఉంటుంది. ఇక అదే సమయంలో విపక్షంలో ఉన్న పార్టీకి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సర్వ శక్తులు ఒడ్డి అధికారంలోకి రావాలి.
ఇలా అటు బీజేపీ నాయకత్వంలోని ఎండీయే కూటమి మళ్ళీ మేమే వస్తామని అంటోంది. బీజేపీ తన వ్యూహాలను మొత్తం ఈ ఎన్నికల్లో వాడుతోంది. ఇండియా కూటమి కూడా చాలా ప్రతిష్టగా ఈ ఎన్నికలను తీసుకుంది. శివసేన ఎన్సీపీలను చీల్చడం వంటివి ఆ పార్టీలకు సానుభూతిని కురిపిస్తాయని అంటున్నారు. అదే టైంలో చీల్చుడు రాజకీయాలు బీజేపీ ఇమేజ్ ని దెబ్బ తీస్తాయని అంటున్నారు.
అయితే బీజేపీ కూటమి మంచి పాలన అందించిందని సీఎం గా ఏక్ నాధ్ షిండేను జనాలు ఇష్టపడుతున్నారని అందువల్ల మరోసారి చాన్స్ ఇస్తారని కమలనాధులు ధీమాగా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు దేశంతో పాటు ఏపీ రాజకీయాల మీద ఏ విధనమైన ప్రభావం చూపిస్తాయన్నది కూడా చర్చ సాగుతోంది.
ఎందుకు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున మహా రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయన ఎండీయే కూటమికి బలమైన గొంతుకగా మారారు. పవన్ తొలిసారిగా ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాంతో ఆయన ఇమేజ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది కూడా చర్చగానే ఉంది.
కాంగ్రెస్ పాలిత సీఎంలు ఇండియా కూటమికి ప్రచారం చేసారు. మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణా నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళి భారీగా ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో ఇండియా కూటమి గెలిస్తే రేవంత్ రెడ్డి ఇమేజ్ మరింత పెరుగుతుంది అని అంటున్నారు. అదే సమయంలో ఏపీ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది అని అంటున్నారు.
మహా ఎన్నికలతో వైసీపీకి నేరుగా సంబంధం లేకపోయినా అక్కడ కాంగ్రెస్ గెలిచి ఆ పార్టీ కూటమి అధికారం చేపడితే దేశంలో కర్ణాటక తెలంగాణా తరువాత మరో రాష్ట్రం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి చేతికి వచ్చినట్లే అని అంటున్నారు.
దాంతో మరింత ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాష్ట్రాల వైపు చూస్తుంది అని అంటున్నారు. ఏపీలో కూడా కాంగ్రెస్ కొత్త రిపేర్లు మొదలెడుతుందని అంటున్నారు. మహా ఎన్నికలలో ఇండియా కూటమి విక్టరీ ఏపీలోనూ ప్రభావం చూపించి దేశంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అన్న సంకేతాలు ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ళేందుకు క్యూ కట్టే నేతలు కూడా ఉంటారని అంటున్నారు.
అది ఇమ్మీడియట్ గా వైసీపీ మీదనే ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. దాంతో హర్యానా ఎన్నికల ఫలితాలు నిరుత్సాహం కలిగించినా తమ బలం ఎక్కడా తగ్గలేదని ఇండియా కూటమి చెప్పుకుని కొత్త మిత్రులను కూడా వెతుక్కునే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు.
ఇక బీజేపీ నాయాకత్వంలోని ఎన్డీయే కూటమి గెలిస్తే జమిలి ఎన్నికలకు శరవేగంగా అడుగులు పడతాయి. ఏపీలో పవన్ ఇమేజ్ కూడా బాగా పెరుగుతుంది. ఇక టీడీపీ కూటమికి అది తిరుగులేని బలాన్ని ఇస్తుంది. దాంతో జమిలి ఎన్నికలు వచ్చినా కూడా తామే మళ్లీ చాంపియన్ గా ముందుంటామని చెప్పుకోవడానికి చాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. ఇండియా కూటమి గెలిస్తే మాత్రం కూటమికి కొంత ఆలోచించుకునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే మహా ఫలితాలు ఏపీలో మహా రాజకీయాన్నే చూపిస్తాయని అంటున్నారు.