Begin typing your search above and press return to search.

ఉద్ధవ్ ఠాక్రే కి సీఎం పోస్ట్ దక్కేనా ?

మహారాష్ట్రలో ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి గట్టిగా నెల రోజుల టైం లేదు అయితే అభ్యర్థుల ఎంపిక దగ్గరే పార్టీలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   23 Oct 2024 6:30 AM GMT
ఉద్ధవ్ ఠాక్రే కి సీఎం పోస్ట్ దక్కేనా ?
X

మహారాష్ట్రలో ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. గట్టిగా నెల రోజుల టైం లేదు. అయితే అభ్యర్థుల ఎంపిక దగ్గరే పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉన్న మహా వికాస్ ఆఘాడీ కూటమిలో సీట్ల పంచాయతీ సాగుతోంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లు కలిగిన మహారాష్ట్రలో సింహభాగం తీసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.

తనకే ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎక్కువ ఎంపీ సీట్లు దక్కాయి. దాంతో పాటు కాంగ్రెస్ ఇమేజ్ పొలిటికల్ గా పెరిగింది దాంతోనే మహా రాష్ట్ర ఎన్నికలను ఎదుర్కొంటామని భావిస్తోంది. దాంతో పాటు మహా వికాస్ ఆఘాడీ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.

ఈ కారణాలతోనే మొత్తం 288 సీట్లలో 125 సీట్లు తమకు కావాలని పట్టుబడుతోంది. అయితే శివసేన నుంచి దీనిని అభ్యంతరం వ్యక్తం అవుతోంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో చేరో వంద సీట్లను శివసేన కాంగ్రెస్ తీసుకుని ఆ మిగిలిన 88 సీట్లను ఎన్సీపీ శరద్ పవార్ కి ఇవ్వాలని శివసేన ప్రతిపాదిస్తోంది. అయితే శివసేన బలం ఏక్ నాధ్ షిండే పార్టీని చీల్చిన తరువాత బాగా తగ్గిపోయిందని కాంగ్రెస్ భావిస్తోంది. దాంతో పాటు తమకు గతం కంటే జనాదరణ అధికంగా ఉందని అంచనా వేసుకుంటోంది.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ సీఎం ఈసారి తప్పనిసరిగా కావాల్సిందే అన్నది ఆ పార్టీ పట్టుదలగా ఉందిట. 2019లో ఎన్నికలు జరిగినపుడు శివసేన బీజేపీ కలసి పోటీ చేశాయి. అపుడు సీఎం పోస్టు దగ్గరే తేడా వచ్చి శివసేన బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ఎన్సీపీలతో చేతులు కలిపింది. ఆ విధంగా ఉద్ధవ్ థాక్రేకి అనూహ్యంగా సీఎం సీటు దక్కింది. రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. కానీ గట్టిగా నిలబెట్టుకోలేక పోయారు.

అయితే ఈసారి కూడా తనకే సీఎం పదవి కావాలని ఆయన కోరుకుంటున్నారు. కూటమిలో శివసేన ఆధిపత్యం చూపించాలని చూస్తోంది. దానికి కాంగ్రెస్ నుంచి బ్రేకులు వేస్తున్నారు. మరో రెండు రోజులలో సీట్ల పంపకం ఒక కొలిక్కి వస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చెబుతున్నారు.

అయితే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ మాత్రం కాంగ్రెస్ శివసేన చెరి సగం సీట్లు తీసుకోవాల్సిందే అని అంటున్నారు. మరి ఈ రకంగా పేచీలు కనుక సాగితే మాత్రం మొత్తం కూటమి ప్రయోజనాలకే ఇబ్బంది అవుతుందని అంటున్నారు.

ఏది ఏమైనా మహా ఎన్నికల్లో అటు బీజేపీ కూటమి కూడా సీట్ల సర్దుబాటు చేసుకోలేక సతమతం అవుతోంది. ఆ పార్టీ కూడా 145 సీట్లను తాను తీసుకుని మిగిలినవి మిత్రులైన శివసేన ఏక్ నాధ్ షిండే వర్గానికి అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి ఇవ్వాలని అనుకుంటోంది.

ఇలా రెండు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ బీజేపీలు సీట్ల సర్దుబాటు విషయంలో రాజీ పడకపోవడమే కాకుండా ఈసారి సీఎం సీటు మాదే అని అంటున్నాయి. ప్రాంతీయ పార్టీల పల్లకీని తాము మోయబోమని తామే ఈసారి పల్లకీ ఎక్కుతామని కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మహా ఎన్నికల్లో ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సిందే.