Begin typing your search above and press return to search.

షాకివ్వనున్న బీజేపీ..మహారాష్ట్ర సీఎంగా కొత్త ముఖం..మరి ఫడణవీస్?

కొత్త సీఎం ఫడణవీస్‌ కాదని మురళీధర్‌ మోహోల్‌ రేసులో ఉన్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 Nov 2024 6:06 AM GMT
షాకివ్వనున్న బీజేపీ..మహారాష్ట్ర సీఎంగా కొత్త ముఖం..మరి ఫడణవీస్?
X

గత ఏడాది ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో మూడుచోట్లా బీజేపీనే నెగ్గింది. అప్పటికి ఆయా రాష్ట్రాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్ వంటి మాజీ సీఎంలను కాదని కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. లోక్ సభ ఎన్నికల ముంగిట ఇలాంటి నిర్ణయాలు ఏమిటని నోరెళ్లబెట్టారు. ఇది బెడిసికొట్టడం ఖాయం అని అనుకున్నారు. మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో బీసీ వర్గానికి చెందిన మోహన్ యాదవ్ ను, ఛత్తీస్ గఢ్ లో ఎస్టీ అయిన విష్ణుదేవ్ సాయిని, రాజస్థాన్ లో అగ్రవర్ణాలకు చెందిన భజన్ లాల్ శర్మను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. మరి తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఏం చేయబోతోంది...?

శిందే కాదు.. ఫడణవీస్ వద్దు..

మహారాష్ట్రలో గత శనివారం ఫలితాలు వెలువడ్డాయి. నవంబరు 26 తోనే ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసింది. ఆపద్ధర్మ సీఎంగా ఏక్ నాథ్ శిందే కొనసాగుతున్నారు. అయితే, మహాయుతి కూటమిలో 132 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ఈ సారి సీఎం పీఠం తమదేనని అన్యాపదేశంగా స్పష్టం చేసింది. శిందే మాత్రం హోం శాఖతో కూడిన డిప్యూటీ సీఎం పదవిని కోరుతున్నారు. చర్చలు ఎటూ తెగకపోవడంతో ఆయన స్వగ్రామం వెళ్లిపోయారనే కథనాలు వస్తున్నాయి. ఇక మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ తాజా ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈయన అభ్యర్థిత్వానికి ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ మద్దతిస్తున్నారు. ఫడణవీస్ అభ్యర్థిత్వంపై మొదటినుంచి బీజేపీ సానుకూలంగానే ఉంది. అయితే, తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది.

శిందే శివాలు

సీఎం, శాఖల కేటాయింపులపై మహాయుతి పార్టీల మధ్య చర్చలు కొలిక్కిరాకపోవడంతో శిందే అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఆయన కూటమి ముఖ్య నేతల సమావేశాన్ని రద్దు చేసుకుని స్వగ్రామం వెళ్లిపోయారు. దీంతో శివసేన నేత సంజయ్‌ శిర్సత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంలో శిందేను పక్కనబెడుతున్నారని ఆరోపించారు. సీఎం ఎవరనే దానిపై బీజేపీ నిర్ణయానికి పూర్తి మద్దతిస్తానని చెప్పిన శిందే.. ముంబయిలో కూటమి నేతల చర్చల తర్వాత రెండు, మూడు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాం అని అన్నారు. కానీ, తర్వాత గంటల్లోనే సమావేశాన్ని రద్దు చేసి సొంతూరు వెళ్లిపోయారు. ఆయన అసంతృప్తిగా ఉన్నారని స్పష్టం అవుతోందని చెబుతున్నారు. అయితే, అనారోగ్య సమస్యలతో ఊరికి వెళ్లినట్లు మరికొందరు నేతలు తెలిపారు.

24 గంటల్లో ప్రకటన.. సీఎంగా మురళీధర్..?

భవిష్యత్తు కార్యాచరణపై శిందే 24 గంటల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. మహాయుతిలో ఉంటారా? లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. కొత్త సీఎం ఫడణవీస్‌ కాదని మురళీధర్‌ మోహోల్‌ రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఈయన పుణె ఎంపీ. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.