'మహా' పోరు.. మామూలు కాదయా!
అంటే.. ఒకే పార్టీ రెండుగా చీలిపోయి.. రెండు కూటములలో కీలక పాత్ర పోషిస్తోంది.
By: Tupaki Desk | 16 Oct 2024 6:30 AM GMTమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశంలో రెండో అతి పెద్ద శాసన సభ స్థానాలున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో 403 స్థానాలు ఉండగా.. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. ఈ మొత్తం స్థానాలకు నవంబరు 20న ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది. అయితే.. మహారాష్ట్ర పోరు మామూలుగా కనిపించ డం లేదు. ఈ ఎన్నికల్లో ఎటు వైపు పక్షమూ ఏకపక్షంగా లేకపోవడం చిత్రం.
అంటే.. ఒకే పార్టీ రెండుగా చీలిపోయి.. రెండు కూటములలో కీలక పాత్ర పోషిస్తోంది. అసలు రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీరెండు కూటములుగా ఉన్నాయి. 1) మహావికాస్ అఘాడీ. ఇది బీజేపీ నేతృత్వం లోని కూటమి. ఈ కూటమి అధికారంలో్ ఉంది. దీనిలో బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) ఉన్నాయి. అయితే.. బీజేపీకి గత 5 ఏళ్ల కిందట మద్దతుగా దారు ఉన్న శివసేనే కుప్పకూలి రెండుగా విడిపోయిన విషయం తెలిసిందే.
ఇక, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కూడా రెండుగా చీలిపోయింది. పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన ఆయన తమ్ముడి కొడుకు అజిత్ పవార్.. పార్టీని చీల్చేశారు. ఈయన ఎన్సీపీ(ఏపీ-అజిత్ పవార్)గా పెట్టుకుని ఎన్నికల సంఘం నుంచి తమదే అసలైన పార్టీ అని గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీలు కలిసి మహాయుతిగా కూటమి ఏర్పాటు చేసుకు న్నాయి. అయితే, మహాయుతికి వచ్చిన తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.
ఇక, వాస్తవ శివసే(ఉద్దవ్ ఠాక్రే వర్గం), వాస్తవ ఎన్సీపీ(ఎస్పీ-శరద్ పవార్)లు కాంగ్రెస్ కూటమిలో ఉన్నా యి. ఈ కూటమి మహా వికాస్ అఘాడీగా ఏర్పడింది. ఈ కూటమి కూడా తొలిసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఇలా.. కీలకమైన రెండు స్థానిక పార్టీలు.. చీలిపోయిన దరిమిలా.. వచ్చిన తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. దీంతో అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ, ఇటు బీజేపీ నేతృత్వంలోని మహాయుతిలు ఎన్నికల్లో విజయం కోసం పరితపిస్తున్నాయి.
సీఎం ఏక్‌నాథ్ షిండే సర్కారు ఎండగట్టేందుకు, రాష్ట్రంలో పెద్ద డిమాండ్‌గా ఉన్న `మరాఠా కోటా` విష యంలో మౌనంగా ఉండడాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. శాంతి భద్రతలు, ఇటీవల జరిగిన మాజీ మంత్రి సిద్ధిఖీ దారుణ హత్య వంటివి ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా మారనున్నాయి. ఇక, బీజేపీ కూటమిపార్టీ.. ఇటీవల జరిగిన హరియాణా ఎన్నికల్లో సాధించిన విజయాన్నే మహారాష్ట్రలోనూ ప్రతిబించాలని భావిస్తోంది. దీంతో మహా యుద్ధం మామూలుగా ఉండబోదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.