Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తేదీలొచ్చేశాయ్.. పోలింగ్ ఎప్పుడంటే?

దేశంలోని అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర ఎన్నికల తేదీలు వచ్చేశాయ్.. దీనితో పాటే జార్ఖండ్ ఎన్నికల తేదీలూ వెలువడ్డాయ్..

By:  Tupaki Desk   |   15 Oct 2024 10:49 AM GMT
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తేదీలొచ్చేశాయ్.. పోలింగ్ ఎప్పుడంటే?
X

దేశంలోని అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర ఎన్నికల తేదీలు వచ్చేశాయ్.. దీనితో పాటే జార్ఖండ్ ఎన్నికల తేదీలూ వెలువడ్డాయ్.. రాజకీయంగా అత్యంత కీలకమైన మహారాష్ట్రతో పాటు.. ప్రతిపక్ష కూటమి అధికారంలో ఉన్న జార్ఖండ్ లో ప్రజా తీర్పు కోరేందుకు పార్టీలు సిద్ధం కావడమే ఇక మిగిలింది. వాస్తవానికి మొన్నటి హరియాణా, జమ్మూ కశ్మీర్ ఎన్నికలతో పాటే మహారాష్ట్ర ఎన్నికలూ నిర్వహిస్తారని మొదట అనుకున్నారు. కానీ, మహారాష్ట్రలో వర్షాలు, వినాయక చవితి వంటి పెద్ద పండుగల నేపథ్యంలో అప్పుడు వాయిదా వేశారు. ఇక హరియాణా, కశ్మీర్ ఎన్నికలు పూర్తవడంతో కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది.

షెడ్యూల్ ఇదిగో

రాజకీయంగా మహారాష్ట్రలో ప్రస్తుతం నాలుగు జాతీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. దీన్నిబట్టే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. 288 సీట్లున్న ఇలాంటి రాష్ట్రంలో ఎన్నికలకు మంగళవారం షెడ్యూల్ విడుదలైంది. అయితే, జార్ఖండ్ లో ఉన్నవి 81 సీట్లే. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం కలిపి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మహారాష్ట్రలో నవంబరు 20న పోలింగ్ నిర్వహిస్తారు. అదే నెల 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

రెండు నెలల్లో నాలుగు ఎన్నికలు

అక్టోబరు 5న హరియాణా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అంతకుముందు సెప్టెంబరులో కశ్మీర్ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నగారా మోగింది. కాగా, నవంబరు 26 వరకు మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఉంది. జార్ఖండ్‌ కు మాత్రం వచ్చే ఏడాది జనవరి 5 వరకు గడువుంది. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు కాగా.. జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు.

జార్ఖండ్ లో రెండు విడతల్లో

మహారాష్ట్రలో ఈ నెల 22న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. 29 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నక్సల్ ప్రభావం ఉన్నందున జార్ఖండ్‌ లో రెండు విడతల్లో ఎన్నికలు తలపెట్టారు. వచ్చే నెల 13, 20 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. అయితే, మహారాష్ట్రతో నవంబరు 23న ఓట్లను లెక్కిస్తారు.

మరి ఢిల్లీకి ఎప్పుడు?

ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువుంది. జనవరిలో గడువు ముగిసే జార్ఖండ్ కు మహారాష్ట్రతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఢిల్లీ సంగతి మాత్రం తేల్చలేదు. వాస్తవానికి ఢిల్లీకి వీటితో పాటే ఎన్నికలు నిర్వహిస్తారనే కథనాలు వచ్చాయి. అయితే, ఢిల్లీ రాజకీయం వేరు కాబట్టి వెనుకా ముందు ఆగనున్నట్లు తెలుస్తోంది.