ఏఐ లో ఏపీ కన్నా ముందుగా మహారాష్ట్ర!
అయితే ఈ విషయంలో ఏపీకన్నా ముందుగా మహారాష్ట్ర పరుగులు తీస్తోంది.
By: Tupaki Desk | 3 Feb 2025 12:30 PM GMTప్రపంచం మొత్తం ఏఐ చుట్టూ పరుగులు తీస్తోంది. 2027 నాటికి మనదేశంలో ఏఐ మార్కెట్ 17 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముంది. దీంతో ఈ రంగంలో సత్తా చాటాలని దేశంలో చాలా రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ పోటాపోటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏఐని ప్రోత్సహిస్తోంది. త్వరలోనే సొంతంగా ఏఐ మోడల్ ని తయారు చేసుకుంటామని కేంద్ర మంత్రి అశ్విణి వైష్ణవ్ ఈ మధ్యే ప్రకటించారు. ఇక ఏపీ రాజధాని అమరావతిని ఏఐ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా విశాఖలో ఏఐ యూనివర్శిటీ స్థాపనకు ప్రయత్నాలు జరగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఏపీకన్నా ముందుగా మహారాష్ట్ర పరుగులు తీస్తోంది.
ఏఐ యూనివర్సిటీలతోపాటు క్స్‌లెన్స్ సెంటర్స్ ఏర్పాటుకు కేంద్రం బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే మహారాష్ట్ర ముందడుగు వేసింది. AI టెక్నాలజీ విషయంలో కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకునేందుకు మహారాష్ట్ర కీలక కసరత్తు మొదలుపెట్టింది. దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేసేందుకు ఓ టాస్క్ ఫోర్సును నియమించింది. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన సదుపాయాలు, వనరులు, సౌకర్యాలపై ఈ టాస్క్ ఫోర్సు రిపోర్టు ఇవ్వనుంది. 30 రోజుల గడువులో రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మహారాష్ట్ర ఐటీ మంత్రి అశిష్ షెలార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ యూనివర్సిటీ ద్వారా ఏఐలో పరిశోధన, అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ఆయన వెల్లడించారు. ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా అకాడమిక్స్‌లో విద్యార్థులకు ఈ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఏపీకి పోటీగా ముందుగా యాక్షన్ లోకి దిగిన మహారాష్ట్ర తొలి ఏఐ యూనివర్సిటీతో క్రెడిట్ కొట్టేయాలని భావిస్తోంది. ఇందుకోసం నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించింది. ఏఐపై నియమించిన టాస్క్ పోర్సులో ఐటీ ఎక్సపర్టలను నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మహారాష్ట్ర ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఏపీలో కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ఏఐపై ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ, మహారాష్ట్ర దూకుడు చూస్తే ఈ విషయంలో ఏపీని వెనక్కి నెట్టాలనే పట్టుదలే కనిపిస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి దేశంలో తొలి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ముందుగా ఎవరు చేరుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.