Begin typing your search above and press return to search.

బీహార్ ఏక్ నాధ్ షిండే నితీష్ కుమార్ ?

దేశంలో ఎన్నో రాష్ట్రాలలో సీఎం పీఠాన్ని అధిరోహించిన బీజేపీకి బీహార్ లో మాత్రం ఆ ముచ్చట తీరలేదు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 4:30 PM GMT
బీహార్ ఏక్ నాధ్ షిండే నితీష్ కుమార్ ?
X

మహారాష్ట్రలో లేటెస్ట్ గా ఏర్పడిన మహాయుతి ప్రభుత్వం ఎన్డీయే మిత్రులకు కొత్త పాఠాలను నేర్పుతోంది. అంతే కాదు సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. బీజేపీ అతి పెద్ద జాతీయ పార్టీ. ఆ పార్టీకి ఒక్కో స్టేట్ లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఉన్నాయి. వాటి వెనక బీజేపీ ఎత్తులు ఉన్నాయి.

తమకు ఎక్కువ సీట్లు వచ్చినా మీకే సింహాసనం అని ఒక చోట మిత్రుడిని సీఎం చేస్తే అదే మరో చోట మాకే ఎక్కువ సీట్లు దక్కాయి కాబట్టి చీఫ్ మినిస్టర్ పోస్ట్ మాదే అని చెప్పడం కూడా బీజేపీ ఎత్తుగడలలో భాగం. 2020లో జరిగిన బీహార్ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలసి పోటీ చేశాయి.

ఆ ఎన్నికల్లో జేడీయూకి 50 లోపు సీట్లే దక్కాయి. బీజేపీకి 80 దాకా సీట్లు వచ్చాయి. మొత్తం 225 ఉండే బీహార్ అసెంబ్లీలో సీఎం సీటు దక్కించుకోవాలంటే 123 సీట్లు రావడం అన్నది మ్యాజిక్ ఫిగర్ అన్న మాట. ఆ విధంగా చూస్తే కనుక మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కడో ఉన్న నితీష్ కుమార్ ని తెచ్చి బీజేపీ సీఎం గా చేసింది.

అలా ఆయనకు సీఎం పోస్టు లభించి కీలక నేతగా మరోసారి జాతీయ రాజకీయాలలో మారారు. ఇక దాని కంటే ఏడాది ముందు మహారాష్ట్రకు ఎన్నికలు జరిగితే బీజేపీ శివసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీకి 105 సీట్లు వస్తే శివసేనకు 55 దాకా వచ్చాయి. అయితే శివసేన తమకు సీఎం పోస్టు కావాలని కోరింది. కానీ పెద్ద పార్టీగా తమకే సీఎం సీటు అంటూ బీజేపీ తేల్చి చెప్పింది. ఫలితంగా శివసేనతో పొత్తు పెటాకులు అయింది. అయినా సరే బీజేపీ తన రాజకీయ వ్యూహాలతో శివసేన ఎన్సీపీలను చీల్చి మరీ చివరి రెండున్నరేళ్ళ పాటు అధికారంలో ఉంది.

అలా శివసేనను చీల్చి వచ్చిన ఏక్ నాధ్ షిండే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ మీరే సీఎం అంటే మొదట షాక్ తిన్నారు. చివరికి ఆయన కుదురుకున్నారు. బాగానే పాలించారు. ఇక ఇపుడు మహాయుతి కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది. షిండే శివసేనకు 57 మంది ఎమ్మెల్యేలు దక్కారు. మరోసారి తనకే సీఎం సీటు అని ఆయన అనుకుంటే బీజేపీ షాక్ ఇచ్చింది.

ఇదేమి పొలిటికల్ మ్యాథమెటిక్స్ అని ఆయన వర్గం ఫైర్ అయినా ఫలితం లేకపోయింది. చివరికి బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. మరి 2022లో షిండే సీఎం ఎందుకు అయినట్లు, నేడు ఎందుకు కానట్లు అంటే అక్కడే ఉంది బీజేపీ లెక్క. అందువల్ల అది అర్ధమై షిండే సర్దుకు పోతున్నారు.

మరి ఈ లెక్క మహారాష్ట్రకేనా లేక బీహార్ కి కూడానా అన్న చర్చ సాగుతోంది. ఎందుకు అంటే 2025లో బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్ లో ఎన్డీయే కూటమిలో ఈ రోజుకీ పెద్ద పార్టీగా బీజేపీ ఉంది. రేపటి రోజున ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుంది. ఎక్కువ సీట్లు సాధిస్తుంది. అపుడు తక్కువ సీట్లు దక్కిన నితీష్ కుమార్ కి బీహార్ పీఠం దక్కుతుందా అంటే కచ్చితంగా కాదనే అంటున్నారు

దేశంలో ఎన్నో రాష్ట్రాలలో సీఎం పీఠాన్ని అధిరోహించిన బీజేపీకి బీహార్ లో మాత్రం ఆ ముచ్చట తీరలేదు. బీహార్ వంటి పెద్ద స్టేట్ కి సీఎం పదవిని చేపట్టాలన్న బీజేపీ ఆశలను 2025లో కచ్చితంగా నెరవేర్చుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

దాంతో నితీష్ కుమార్ క్యాంప్ లో ఇప్పటి నుంచే టెన్షన్ పట్టుకుంది. ఆయన ఎటూ అన్ని పార్టీలతో పొత్తులను కలపగలరు. కానీ ఇపుడు ఎన్నికలలో మాత్రం ఎన్డీయే కూటమితోనే ఉండాల్సి ఉంది. ఇక ఎన్నికల వేళ బీజేపీ బీహార్ లో కొత్త స్ట్రాటజీస్ రూపొందిస్తుంది అని అంటున్నారు. ఆరు నూరు అయినా ఈసారి బీహార్ లో ఎన్డీయే కూటమిదే సర్కార్ అని అంటున్నారు కమలనాధులు. వచ్చేది బీజేపీ ముఖ్యమంత్రే అని చెబుతున్నారు.

మరి నితీష్ సంగతేంటి అంటే ఆయనను కేంద్ర మంత్రిగా తీసుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనా నితీష్ క్యాంప్ లో మహారాష్ట్ర రాజకీయం అయితే కలవరం రేపింది అనే అంటున్నారు. సీఎం గానే మరింతకాలం ఉండాలని చూస్తున్న నితీష్ కి బీజేపీ ఎత్తుగడలు షాక్ ఇస్తాయా లేక ఆయన తనదైన శైలిలో పొత్తులు కూటములు మార్చి మళ్లీ సీఎం అవుతారా అన్నది 2025 ఎన్నికల ఫలితాల తరువాతనే చూడాల్సి ఉంటుంది.